రాజధాని తరలింపు: హైకోర్టులో కౌంటర్‌ దాఖలుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం

By Siva KodatiFirst Published Aug 29, 2020, 5:16 PM IST
Highlights

రాజధాని తరలింపు వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలుకు జనసేన పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టు రాజకీయ పార్టీలకు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించింది

రాజధాని తరలింపు వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలుకు జనసేన పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టు రాజకీయ పార్టీలకు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించింది.

ఇందుకు సంబంధించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్, శివశంకర్ తదితరులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన పార్టీ తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే వస్తోందన్నారు.

ప్రభుత్వాన్ని విశ్వసించి భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలను 28వేల మందికి పైగా రైతులు తమ పంట పొలాలను ఇచ్చేశారని పవన్ గుర్తుచేశారు. తమ భూములు ఇచ్చిన వేల మంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని జనసేన బలంగా చెబుతోందన్నారు.

అలాగే అక్కడి భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని జనసేనాని తెలిపారు. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారని పవన్ పేర్కొన్నారు.

పర్యావరణహితమైన రాజధాని నిర్మాణం జరగాలి అని చెబుతూ వస్తున్నామని, ప్రస్తుత తరుణంలో రాజధాని తరలింపు అంశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయని ఆయన చెప్పారు.

వాటికి సంబంధించి పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నామని పవన్ స్పష్టం చేశారు. హైకోర్టు ఈ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించిందని, అందుకు తగ్గట్టుగానే కౌంటర్ దాఖలు చేస్తామని తుది వరకు బాధ్యతగా నిలబడతామని పవన్ పేర్కొన్నారు.

ఈ అంశానికి సంబంధించి పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నామని, న్యాయ నిపుణుల సలహాలు, సహకారంతో గడువులోగా కౌంటర్ దాఖలు చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

click me!