నూతన్ నాయుడి ఇంట్లో శిరోముండనం: పవన్ కల్యాణ్ జనసేన హెచ్చరిక

By telugu teamFirst Published Aug 29, 2020, 4:37 PM IST
Highlights

విశాఖపట్నంలోని పెందుర్తిలో గల నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దళితుడి శిరోముండనం సంఘటనలో పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించడాన్ని జనసేన తీవ్రంగా ఖండించింది. అలా చేసేవారికి హెచ్చరికలు జారీ చేసింది.

విజయవాడ: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ అభిమాని అని, జనసేన పార్టీలో వున్నారని చేస్తున్న అసత్య, అసందర్భపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలో శ్రీ పవన్ కళ్యాణ్  పేరును తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జనసేన తెలిపింది.

ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కారని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ అన్యాయానికి కొమ్ము కాసే నేత కాదని ప్రతి ఒక్కరికీ తెలుసని ఆయన అన్నారు.. అన్యాయం ఎక్కడ జరిగినా జనసేన వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. బాధితులకు బాసటగా నిలుస్తుందని అన్నారు. 

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరిగిన అకృత్యాలపై పవన్ కళ్యాణ్ బలంగా స్పందించిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్న సంగతిని దుష్ప్రచారకులు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.  పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మంది అభిమానులు ఉన్న సుప్రసిద్ధ హీరో అని తెలిపింది. నిందితుడు ఆయన అభిమాని అయినంత మాత్రాన ఇటువంటి దురదృష్టకర సంఘటనలో ఆయన పేరు తీసుకు రావడం గర్హనీయమని శివశంకర్ అన్నారు. 

ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని జనసేన కోరుతోందని చెప్పారు.. ప్రమేయంలేని విషయాలలో పార్టీనిగాని లేదా పార్టీ అధ్యక్షులు, నాయకుల పేర్లను ప్రస్తావించిన పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

click me!