
విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు అంకెల గారడీ అని, ప్రజలను మోసం చేసే అభూత కల్పన కార్యక్రమని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ మనోహర్ విమర్శించారు. రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్లు వస్తున్నాయని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మోసపూరితమని అన్నారు. అంకెల గారడీతో యువతలో ఆశలు రేకెత్తేలా చేస్తున్న తప్పుడు ప్రచారాలను జనసేన పార్టీ ఖండిస్తుందని అన్నారు. రాజమండ్రిలో నాదెండ్ల మనోహర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కలను చంపేసిన ఈ ప్రభుత్వం మీద పెట్టుబడిదారులకు ఏ విధంగా నమ్మకం కలుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు రూ. 175 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గత ఎన్నికల ముందు జగన్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రజలు నమ్మారని.. అయితే నాలుగేళ్ల పాలనలో అలాంటి ప్రయత్నాలు ఏమి జరగలేదని విమర్శించారు.
సీఎం జగన్ రిలయన్స్ కంపెనీ మీద కక్ష గట్టారని ఆరోపించారు. తిరుపతిలో రూ. 15 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని వారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారని అని అన్నారు. అయితే అదే రిలయన్స్‌కు చెందని వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని చెప్పారు. విశాఖలో ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు వచ్చిన ముఖేష్ అంబానీ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ఎక్కడైనా తన ప్రసంగంలో చెప్పారా?, పెట్టుబడి ప్రణాళికలు ఏమైనా చూపారా? అని ప్రశ్నించారు. అలాంటిదేమి జరగలేదని.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కోడి గుడ్డును మర్చిపోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వారి శాఖ విడుదల చేసిన ప్రకటనలో సీ ఫుడ్‌లో కోడి గుడ్లను కూడా కలిపేశారని విమర్శించారు. సీ ఫుడ్ అంటే చేపలు, రొయ్యలు అని తెలుసునని.. మరి కోడి గుడ్డు ఆ జాబితాలో ఎలా చేరిందని ప్రశ్నించారు. ఇక, ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలను కొత్తగా చూపిస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.