జగన్ కు కౌంటర్, బాబుకు సవాల్: పవన్ కవాతు రాజకీయ వ్యూహమే

By Nagaraju TFirst Published Oct 17, 2018, 4:21 PM IST
Highlights

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కవాతు ఉద్దేశం ఏంటి.....చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ ఎందుకు వేదిక అయ్యింది....పవిత్రనది గోదారమ్మ సాక్షిగా కవాతు ఎందుకు నిర్వహించారు...ఇవే అధికార ప్రతిపక్ష పార్టీలను సంధిస్తున్న ప్రశ్నలు. 

రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కవాతు ఉద్దేశం ఏంటి.....చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ ఎందుకు వేదిక అయ్యింది....పవిత్రనది గోదారమ్మ సాక్షిగా కవాతు ఎందుకు నిర్వహించారు...ఇవే అధికార ప్రతిపక్ష పార్టీలను సంధిస్తున్న ప్రశ్నలు. 

జనసేన కవాతు జగన్ ప్రజాసంకల్పయాత్రకు పోటీగా నిర్వహించారా...రాజకీయ వ్యూహమా అన్న అనుమానాలు లేకపోలేదు. అయితే జనసేన కవాతు రాజకీయ ఎత్తుగడలో వ్యూహమేనన్నది వాస్తవం. జనసేన కవాతు ఆ పార్టీ భవిష్యత్తుకు ఒక పునాది లాంటిదని ఆ పార్టీ భావిస్తోంది. 

ఇక జనసేన కవాతుకు రాజకీయ వ్యూహాలకు సంబంధం ఏంటో ఓసారి చూద్దాం. ఉభయగోదావరి జిల్లాలు అంటే ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక శాసనసభ స్థానాలను, పార్లమెంట్ స్థానాలను కలిగిన జిల్లా తూర్పుగోదావరి. అందుకే ఈ జిల్లా అధికార పార్టీని నిర్ణయిస్తోంది. అది ఎలా అంటారా ఈ జిల్లాలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నమాట. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.

అటు పశ్చిమగోదావరి  జిల్లా. ఈ జిల్లా కూడా 15 అసెంబ్లీ నియోజకవర్గాలతో రెండో స్థానంలో ఉంది. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల అసెంబ్లీ స్థానాలు కలిపితే 34 స్థానాలు. నవ్యాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 20శాతం ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తారు. అందుకే ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థానాలు ఏ పార్టీ గెలుచుకున్న ఆ పార్టీదే అధికారం అది వాస్తవం కూడా. 

గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ 12, వైసీపీ 5 స్థానాలు, బీజేపీ ఒకటి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 14 టీడీపీ గెలుపొందగా ఒక స్థానం మిత్రపక్షమైన బీజేపీ గెలుపొందింది. అంటే రెండు జిల్లాల్లో కలిపి 29 స్థానాలు టీడీపీ మిత్రపక్షంతో కలిపి కైవసం చేసుకుంది.  

ఇది రాజకీయాల్లో ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ రెండు జిల్లాలపైనే ఆధారపడతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే చాలు ముందు రెక్కలు కట్టుకుని పార్టీలన్నీ వాలిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నది నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి ఉన్న ఉభయగోదావరి జిల్లాలలో తన పట్టు ఎంత ఉందో నిరూపించేందుకు పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలను కలిపే చారిత్రాత్మ వారధి సర్ అర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ ని ఎంచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే గోదావరి పుణ్యనదిని ఎందుకు సాక్షిగా ఎంచుకున్నారంటే ఈ నీరు నాది నేల నాది అన్న సందేశం ఇచ్చేందుకే. పవన్ కళ్యాణ్ చిన్నతనంలో పశ్చిమగోదావరి జిల్లా మెగల్తూరులో పెరిగారు. ఆ ఊరికి గోదావరి నది అతి సమీపంలో ఉంది. అందుకే తాను ఈ నీరు తాగి బతికినవాడినేనని తాను ఈ  జిల్లాల వాసినంటూ ప్రాంతీయ అభిమానం పొందేందుకు పవన్ చేసిన ప్రయత్నం  ఫలించిందని చెప్పుకోవచ్చు.   

ఇకపోతే కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. రాజకీయాల్లో తాను ఏ ఒక్కకులానికి చెందిన వాడిని మాత్రం కాదని తాను అందరి వాడినంటూ పదేపదే చెప్తుంటారు పవన్ కళ్యాణ్. అది ఆచరించడం వేరు. ఏపార్టీ అయిన రాజకీయాల్లో మనుగడ సాధించాలి అంటే కుల బలం, ఆర్థిక బలం, అంగబలం అనేది ఈ రోజుల్లో తప్పనిసరి. రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశ పార్టీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఆయా సామాజిక వర్గాల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. 

ఇదే అంశానికి వస్తే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలు. ఈజిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో దాదాపుగా 35వేల నుంచి 50వేల వరకు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అలాగే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జన్మించింది ఈ జిల్లాలోనే. ఉభయగోదావరి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు నిర్దేశించే సామర్ధ్యం కాపు సామాజికవర్గానికి చెందిన నేతలకు ఉందనడంలో ఎంతైనా వాస్తవం ఉంది. ఫలితంగా కవాతు ద్వారా పవన్ కళ్యాణ్ తన కుల బలాన్ని కూడా ఇతర పార్టీలకు చూపించడంలో సక్సెస్ అయ్యారు. 

మరోవైపు కాపు రిజర్వేషన్ల అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు కూడా జనసేన కవాతు ఎంతో ఉపయోగపడింది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు అనుసరించిన వ్యవహార శైలి, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాపురిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు కాపుల ఆగ్రహాన్ని చవిచూశారు. కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేని అంశమని అవసరమైతే కార్పొరేషన్ నిధులు పెంచుతామని జగన్ అనడం ఆ తర్వాత అనలేదని చెప్పడం ఇలా కాపు రిజర్వేషన్ల అంశంలో ఇరుకున పడ్డారు. ఫలితంగా కాపు సామాజికవర్గం నుంచి కాస్త దూరం అయ్యారన్నది జగన్ ఎరిగిన సత్యం. 

అయితే కాపు రిజర్వేషన్ల అంశంపై మాజీఎంపీ మెగాస్టార్ చిరంజీవి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏ కార్యక్రమం తలపెట్టినా చిరంజీవిని సంప్రదించకుండా చెయ్యరన్నది కూడా కాస్త వాస్తవికత ఉంది. అటు పవన్ కళ్యాణ్ కూడా కాపు రిజర్వేషన్ల అంశంపై సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని కూడా క్యాష్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారనడంలో ఎలాంటి సందేహం లేదు.  

మరోవైపు ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్థికంగా బలవంతులైన కాపు సామాజికవర్గం నేతల అండదండలను కూడా పవన్ కోరుతున్నారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల సెంటిమెంట్ ను కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకే తొలిసారిగా తమ పార్టీ అభ్యర్థిని కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రకటించారు. ముమ్మడివరం నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బాలకృష్ణను పవన్ ఎంపిక చేసి ఉభయగోదావరి జిల్లాలంటే తనకు ఎంత సెంటిమెంట్ ప్రజలకు తెలియజేశారు. 

వాస్తవంగా చూస్తే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తోట చంద్రశేఖర్, కందుల లక్ష్మీ దుర్గేష్, పితాని బాలకృష్ణ అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు అత్యధిక శాతం ఈ జిల్లాలకు చెందిన వాళ్లే ఉన్నారు. దీంతో ఉభయగోదావరి జిల్లాలో తన ప్రాబల్యం చూపించుకుని ఇక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించేందుకు పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జనసేనలో నాదెండ్ల చేరిక వెనక పారిశ్రామికవేత్త: ఎవరాయన?

చంద్రబాబు, జగన్‌లపై పవన్ ఫైర్..."కవాతు ఎందుకు చేపట్టామంటే"

నేను బల ప్రదర్శన చేస్తే.. శత్రువులు మిగలరు.. పవన్

కాటన్ బ్యారేజ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతు (ఫోటోలు)

చంద్రబాబు క్లీన్‌గా బయటకు రావాలి: పవన్‌కళ్యాణ్

ధవళేశ్వరం బ్రిడ్జిపై పవన్: కవాతులో కదం తొక్కిన జనసైనికులు

పవన్ కళ్యాణ్‌కు షాక్: ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరణ

కవాతులో పాల్గొండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్

click me!