ప్రముఖ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన 'విధ్వంసం' పుస్తకాన్ని చంద్రబాబుతో కలిసి ఆవిష్కరించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా వైసిపి సర్కార్, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు పవన్.
విజయవాడ : కూల్చివేతలతో పాలనను ప్రారంభించిన వైసిపి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసారు... అమరావతి ప్రజలను హింసించారు... ఇలా అందరినీ బాధపెట్టి, రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని పవన్ హెచ్చరించారు. ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేసిన వారు కూడా క్లాస్ వార్ గురించి మాట్లాడటం విచిత్రం... వారికి భవిష్యత్ లో సరైన గుణపాఠం చెబుతామని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
గురువారం రాత్రి విజయవాడలో జరిగిన 'విధ్వంసం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ లో సాగిన వైసిపి పాలన గురించి ప్రముఖ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ ఈ పుస్తకం రాసారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తొలి ప్రతిని పవన్ కల్యాణ్ కు అందజేసారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ప్రతిపక్షాలు ఎందుకు కలవాలి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకు చీలకూడదు? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పార్టీలు ప్రజల పక్షాన ఎందుకు నిలవాలి? అన్న ప్రశ్నలకు విధ్వంసం పుస్తకంతో జవాబు దొరుకుతుందన్నారు. ఈ పుస్తకాన్ని ఏ రాజకీయ పార్టీకి మద్దతుగానో... మరేదో పార్టీకి వ్యతిరేకంగానో రాయలేదని... ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో అదే రాసారన్నారు. కేవలం ప్రజల పక్షాన నిలబడే రచయిన ఈ పుస్తకాన్ని రాసారని పవన్ పేర్కొన్నారు.
Also Read కుర్చీని మడతబెడితే...: సీఎం జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్
అమరావతి రైతుల మీద పడ్డ దెబ్బలు చూసి గుండె చెదిరింది... ఆడపడుచులపై అఘాయిత్యాలు తనను చాలా బాధించాయని పవన్ అన్నారు. త్వరలోనే ఎన్నికలు వున్నాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా వున్నాం... కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన మొదట్లో వారి దాష్టికాలను తట్టుకోగలమా అని భయమేసిందన్నారు. ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధితులుగా మారారు... వారు అనుభవించిన బాధలనే విధ్వంసం పుస్తకంలో పొందుపర్చారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు రచయితగా మారితే ఎలా వుంటుందో ఈ పుస్తకం తెలియజేస్తుందని... ఇది పాలకులకు హెచ్చరిక అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇక వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వక్రీకరించిందని పవన్ తెలిపారు. వాలంటీర్లే రాష్ట్రంలోని మహిళల అదృశ్యానికి కారణమని తాను అనలేదు... వీరి ద్వారా వైసిపి ప్రభుత్వం డేటాను సేకరించి ఎవరిచేతికో ఇచ్చిందని అన్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం పక్కదారి పడుతోందని... తద్వారా నేరాలు జరిగే ఆస్కారం వుందని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. అలాగే కొందరు వాలంటీర్లు చేసే పనులు మొత్తం వాలంటీర్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోందని హెచ్చరించానన్నారు. వాలంటీర్ వ్యవస్థమీద తనకు గౌరవం వుందని పవన్ తెలిపారు.
రాష్ట్రంలో 33 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదు... వైసిపి నాయకులు తనపై విరుచుకుపడ్డారని పవన్ గుర్తుచేసారు. కానీ కేంద్ర ప్రభుత్వమే సాక్షాత్తూ పార్లమెంటులో మహిళల అదృశ్యం నిజమేనని తేల్చిందన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ కూడా మహిళలు అదృశ్యం మాట నిజమేనని ఒప్పుకున్నారు... ఆలస్యంగా అయినా తాను చెప్పింది నిజమేనని ఒప్పుకున్నందుకు సంతోషమని పవన్ అన్నారు.