
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమాలు తీసి తాను పార్టీని నడుపుతాన్నని చెప్పారు. గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతానని, అక్రమంగా మట్టి, ఇసుక తరలింపుపై పోరాటం చేయాలని సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేందుకు కులం చూడవద్దని, ఎమ్మెల్యే అయినా శిక్షపడాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చివరికి మనవాడు తప్పు చేసినా శిక్షించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటి జనసేన నాయకులకు వున్న కమిట్మెంట్ 2009లో వుండి వుంటే పార్టీని విలీనం చేయాల్సిన అవసరం వుండేదికాదన్నారు. నాయకులకు జవాబుదారీతనం వుండాలని పవన్ పేర్కొన్నారు. రాజోలులో జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వెళ్లిపోవచ్చు గాక.. కానీ ఇక్కడి వారు తనను గెలిపించారని జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. గోదావరి జల్లాల్లో 18 శాతం ఓట్లు పోలయ్యాయని.. 20 లక్షల మంది జనసేనకు ఓటు వేశారని పవన్ తెలిపారు. చాలా మంది నేతలు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జనసేనాని ప్రశంసించారు. అందరినీ కలవలేకపోయానని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడితూ.. వారాహిపై పవన్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్నాడని, బట్టలూడదీసి కొడతానని అంటున్నారని.. కొట్టించుకోవడానికి మేం తెరగా వున్నామా అంటూ అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు పరిపక్వత లేదని, అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే సినిమా షూటింగ్‌లు అనుకునే పరిస్ధితిలో పవన్ వున్నారని రాంబాబు సెటైర్లు వేశారు.