గోటితో పోయేదానికి.. రాపాక అరెస్టుపై పవన్ కళ్యాణ్

By telugu teamFirst Published Aug 13, 2019, 2:54 PM IST
Highlights

ప్రజల తరపున పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని పవన్ అభిప్రాయపడ్డారు.
 

రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనంతట ఆయనే స్వయంగా రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కాగా..  ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల తరపున పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని పవన్ అభిప్రాయపడ్డారు.

గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తీసుకువచ్చారని పవన్ పేర్కొన్నారు. నెల్లూరు లో వైసీపీ ఎమ్మెల్యే  జర్నలిస్ట్ పై దాడికి ప్రయత్నిస్తే... ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే.. తాను రాజోలు వచ్చి పోరాడతానని పవన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. 

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించారు. ఈ క్రమంలో ఏకంగా ఆయనే వచ్చి రాజోలు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన అరెస్టు నేపథ్యంలో రాజోలులో పోలీసులు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఎమ్మెల్యే రాపాకపై పోలీస్ కేసు... స్పందించిన డీఐజీ

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేనకు షాక్.. ఎమ్మెల్యే రాపాక అరెస్టుకి రంగం సిద్ధం

click me!