సందిగ్దంలో ఉన్నవారికి పట్టభద్రులు దారి చూపారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పవన్ కల్యాణ్

By Sumanth KanukulaFirst Published Mar 19, 2023, 6:10 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు వారి ఓటు ద్వారా  కనువిప్పు కలిగించారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయని అన్నారు. వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో కూడా వ్యతిరేక ఫలితమే ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అని అన్నారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికగా ఉన్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. సందిగ్దంలో ఉన్నవారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారని అన్నారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా  ఓటువేసినవారికి అభినందనలు అని చెప్పారు. 

ఇక, మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు(9 స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల) ఎన్నికలు జరగగా.. 5 స్థానిక సంస్థల  స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. మిగిలిన 4 స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైసీపీ కైవసం చేసుకోంది. అయితే మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం.. అధికార పార్టీపై వ్యతిరేకతకు నిదర్శనమని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటే..  ఏపీలో అకాల వర్షం  కారణంగా పలుచోట్ల పంటలు దెబ్బతిన్న సంగతి  తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వడగండ్ల వానతో కూడిన వర్షాలు వారిని మరింత కృంగదీస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మిర్చి రైతులు.. ఉమ్మడి కృష్ణా , పశ్చిమ గోదావరిలలో.. మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు.. ఉమ్మడి అనంతలో ఉద్యానవన పంటలు.. నెల్లూరులో వరి పంటకు తీవ్ర నష్టం కలిగిందని జనసేనాని వెల్లడించారు. వీటితో పాటు అరటి, మొక్కజోన్న, కర్బూజ , బొప్పాయి పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని పవన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. 

click me!