
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆయన.. మంగళవారం అమిత్‌షాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నిక అంశం కూడా ఇద్దరి మధ్యా చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
కాగా, వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఆయన ఢిల్లీ పయనమయ్యారు. పవన్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు.
తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే అంశంపై వెనక్కి తగ్గేది లేదని పవన్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా జనసేనాని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం వుంది.