2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా, మాది విప్లవసేన: ఇప్పటం గ్రామస్తులకు పవన్ ఆర్ధిక సహాయం

By narsimha lode  |  First Published Nov 27, 2022, 12:45 PM IST

ఇప్పటంలో  ఇళ్లు  కోల్పోయిన  బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయాల చొప్పున జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఇవాళ ఆర్ధిక  సహాయం అందించారు.  ఇప్పటం గ్రామస్తులకు తాను  అండగా  ఉంటానని  ఆయన  ప్రకటించారు. 


అమరావతి:ఇప్పటం గ్రామస్తుల  గడపలు  కూల్చిన  వైసీపీ గడపను  కూల్చేవరకు  తాను  నిద్రపోనని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2024లో  వైసీపీ  ఎలా గెలుస్తుందో  తాను  కూడా  చూస్తానని  పవన్ కళ్యాణ్  సవాల్  విసిరారు. ఇప్పటంలో  ఇళ్లు  కోల్పోయిన  39  మందికి   ఒక్కొక్కరికి  లక్ష రూపాయాల  ఆర్ధిక సహాయాన్ని  జనసేన చీఫ్  పవన్  కళ్యాణ్  ఆదివారంనాడు  అందించారు. ఈ  సందర్భంగా  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. 2024  ఎన్నికల  తర్వాత  తాము  కూడా  చట్టప్రకారంగానే వైసీపీ నేతల ఇళ్లను  కూలుస్తామన్నారు. వైసీపీ నేతలకు సంస్కారం, మంచి, మర్యాద పనిచేయదని ఆయన  చెప్పారు. వైసీపీ  ఫ్యూడలిస్టిక్ గోడలు  బద్దలు కొడతామన్నారు.

తాను  అన్నింటికి  సిద్దపడే  రాజకీయాలకు  వచ్చానని  పవన్ కళ్యాణ్  చెప్పారు. ఇప్పటంలో  ఇళ్ల  కూల్చివేతల  వెనుక  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ఉన్నారని ఆయన  ఆరోపించారు.  ఇది ఆధిపత్య  అహంకారం కాదా  అని సజ్జల రామకృష్ణారెడ్డిని  పవన్  కళ్యాణ్  ప్రశ్నించారు.

Latest Videos

undefined

తమను  రౌడీసేన  అని వైసీపీ నేతలు  చేస్తున్న విమర్శలకు  పవన్  కళ్యాణ్  ఘాటుగా సమాధానం ఇచ్చారు. తమది రౌడీసేన కాదు విప్లవ సేన అంటూ  చెప్పారు. మీ మాదిరిగా  దౌర్జన్యాలు చేసేవారికి తాము  రౌడీలుగా  కన్పిస్తుండొచ్చన్నారు. కానీ  ప్రజల  దృష్టిలో  తాము  విప్లవకారులని ఆయన  చెప్పారు.వీది రౌడీలతో  ఎలా ప్రవర్తించారో  తమకు  తెలుసునని ఆయన తెలిపారు. వైసీపీ పార్టీనా, టెర్రరిస్టు  సంస్థా  అని పవన్ కళ్యాణ్  వ్యాఖ్యానించారు.  అనంతపురంలో  రాఫ్తాడు  ఎమ్మెల్యే  తోపుదుర్తి  ప్రకాష్ రెడ్డి సోదరుడు  చంద్రశేఖర్  రెడ్డి  చేసిన వ్యాఖ్యలను  ఈ సందర్శంగా  పవన్  కళ్యాణ్ ప్రస్తావించారు. 

తనకు  అండగా  ఉన్న  ఇప్పటం  గ్రామస్తులకు  అండగా  ఉంటానని ఆయన  చెప్పారు. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  భీమ్‌రావు  బస్తీని  కూల్చిన  సమయంలో  తాను  బయటకు వచ్చిన విషయాన్ని  ఆయన  గుర్తు  చేశారు. ఆనాడు  తనకు  ఏ  రకమైన  బాధ  కలిగిందో  ఇప్పటంలో  ఇళ్ల కూల్చివేత  సమయంలో  కూడా  అదే  రకమైన బాధ  కల్గిందన్నారు.పరిహారం చెల్లించకుండా  ఇళ్లు  కూల్చివేయడం  బాధ  కల్గించిందని  పవన్ కళ్యాణ్  చెప్పారు. కక్షతోనే  వైసీపీ ప్రభుత్వం ఇదంగా  చేసిందని  ఆయన  ఆరోపించారు.ఇప్పటం గ్రామస్తులు  చూపించిన తెగువను  అమరావతి  రైతులు  చూపించి   ఉంటే అమరావతి  కదిలేది  కాదని  పవన్ కళ్యాణ్  అభిప్రాయపడ్డారు. ఇప్పటం గ్రామస్తుల గుండెలకు  తగిలిన  దెబ్బకు  జనసేన  మందు  రాస్తుందన్నారు. 

మీ  గుండెల్లో  నాకు ఇచ్చిన  స్థానం ముందు  సీఎం  సహా  ఏ పదవైనా  తనకు  చాలా  చిన్నదేనని పవన్  కళ్యాణ్  ఇప్పటం  వాసులనుద్దేశించి   చెప్పారు. రాజ్యాంగబద్దమైన  పదవిని సాధించడం  అసాధ్యం  కాకపోవచ్చన్నారు. కానీ ప్రజల గుండెల్లో  స్థానం దక్కించుకోవడం  అందరికీ  సాధ్యమయ్యే  పని కాదని  పవన్  కళ్యాణ్ చెప్పారు. తనకు  మీ గుండెల్లో  స్థానం ఇచ్చిన  ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు  తెలిపారు  పవన్ కళ్యాణ్.

click me!