మరోసారి ముద్రగడతో జనసేన నేత బొల్లిశెట్టి కీలకభేటి.. సంక్రాంతి తరువాత క్లారిటీ...

By SumaBala BukkaFirst Published Jan 13, 2024, 1:35 PM IST
Highlights

రెండురోజుల వ్యవధిలోనే మరోసారి జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి తరువాత జనసేనకు చెందిన కీలకనేత ముద్రగడను కలిసి, పార్టీలోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. 

కిర్లంపూడి : ముద్రగడ పద్మనాభం ఇంటికి జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ శనివారం మరోసారి వెళ్లారు. మధ్యాహ్నం వేళ భోజనానికి కలిశారు. ముద్రగడ, బొల్లి శెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిశారు. ఆ తరువాత రెండు గంటలకే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు. 

అయితే, దీనిమీద ముద్రగడ ఏమీ చెప్పలేదు. వీరిద్దరితో మామూలుగానే మాట్లాడామన్నారు. ఇద్దరు నేతలు కలిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు కదా అంటూ చెప్పుకొచ్చారు. కాగా, రెండురోజుల వ్యవధిలోనే మరోసారి జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి తరువాత జనసేనకు చెందిన కీలకనేత ముద్రగడను కలిసి, పార్టీలోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. 

సీఎం అభ్యర్ధిగా చిరంజీవి: కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముద్రగడతో చర్చించడానికే బొల్లిశెట్టి శ్రీనివాస్ వచ్చారని ముద్రగడ అనుచరులు అంటున్నారు. కాగా, ముద్రగడ వైసీపీలో చేరతారన్న వార్తలు కూడా విపరీతంగా వెలువడ్డాయి. కానీ, వైసీపీలో తాను అడిగిన సీట్లకు  ఇన్చార్జిలను వైసిపి వేరే వారిని ప్రకటించింది. వైసీపీలో చేరితే పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేటల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని… కాకినాడ ఎంపీ సీటును కోరుకున్నారు. అయితే.. వైసిపి గతవారం విడుదల చేసిన కొత్త ఇన్చార్జిల జాబితాలో ఈ స్థానాల్లో వేరే వారిని ఇన్చార్జీలుగా ప్రకటించింది. 

దీంతో ముద్రగడ వైసీపీలో చేరే ఆశలు ఆవిరైపోయాయి. ఈ క్రమంలోనే మరో వార్త వెలుగు చూస్తోంది. ముద్రగడతో జనసేన నేతలు చర్చించారు. జనసేన నేతలు కిర్లంపూడిలో ఉన్న మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్చార్జి బొల్లి శెట్టి శ్రీనివాస్ తో సహా మరి కొంతమంది నేతలు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. 

వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ, ఏకాంత చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ లేఖ రాశారు. ఈ విషయాన్ని కూడా వారు ప్రస్తావించారట.  దీనికి కూడా ముద్రగడ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కాపు జాతి అంతా కలిసి పని చేయాలని జనసేన నేతలతో ముద్రగడ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే..  మరో పరిణామం కనిపిస్తోంది..  టిడిపి నేత జ్యోతుల నెహ్రూ  గురువారం నాడు ముద్రగడను కలిసి టీడీపీ-జనసేన కూటమిలోకి ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. 

ఇక మరోవైపు రెండు, మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడను స్వయంగా కలవనున్నారని చర్చ జరుగుతోంది. గతంలో.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈసారి జనసేన - టిడిపి కూటమి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ముద్రగడను కలుపుకుపోవాలని చూస్తుండడం, మరోవైపు వైసీపీకి మరో కాపు నేత అంబటి రాయుడు కూడా దూరం అవ్వడం.. ఇప్పుడు ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి తరువాత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని కూడా సమాచారం. ముద్రగడ ఏ పార్టీలోకి చేరతారనేది సంక్రాంతి తరువాతే క్లారిటీ రానుంది. 

click me!