బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకత్వంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపికి, జనసేనకు మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట నిజమేనని పవన్ కల్యాణ్ అంగీకరించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారశైలిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉందని ఆయన అంగీకరించారు.
బిజెపి ఢిల్లీ నాయకత్వం ఒక రకంగా, రాష్ట్ర నాయకత్వం మరో విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నిారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం తమను చిన్నచూపు చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
undefined
ఇదిలావుంటే, తిరుపతి లోకసభ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టు వీడడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. తిరుపతి సీటును తమకు కేటాయించాలని చాలా కాలంగా పవన్ కల్యాణ్ బిజెపిపై ఒత్తిడి పెడుతూ వస్తున్నారు. ఆ స్థితిలోనే బిజెపి విశాఖపట్నంలో సమావేశమై తిరుపతిలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంది.
బిజెపి సమావేశంతో తిరుపతి సీటును జనసేనకు కేటాయించడానికి బిజెపి సిద్ధంగా లేదనే అభిప్రాయం స్థిరపడింది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తిరుపతిలోనే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తిరుపతి లోకసభ ఉప ఎననిక అభ్యర్థిపై వారంలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. బిజెపి బరిలో నిలిస్తే జిహెచ్ఎంసీ స్తాయిలో బలంగా పోటీ చేయాలని అన్నారు. జనసేన పోటీలో నిలిస్తే ఏడు శాసనసభా నియోజకవర్గాల్లో తానే ప్రచారం చేస్తానని చెప్పారు.
దీన్నిబట్టి తిరుపతి సీటు నుంచి తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది.
మరోమారు సమావేశం తర్వాత తిరుపతి అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. బిజెపి రాష్ట్ర నాయకత్వంతో క్షేత్ర స్థాయి సమస్యలు ఉన్నట్లు తాను పీఎసీలో చెప్పినట్లు తెలిపారు. గతంలో ఇబ్బందులు ఉంటే తాను బిజెపి అగ్ర నాయకత్వంతో మాట్లాడినట్లు తెలిపారు. దీన్ని బట్టి తిరుపతి సీటు విషయంలో పవన్ కల్యాణ్ బిజెపి జాతీయ నాయకత్వంతో తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.
మరోవైపు, తిరుపతిలో తమ అభ్యర్థిని పోటీకి దించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు తిరుపతికి తమ అభ్యర్థులను ప్రకటించాయి. బిజెపి-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి తేలాల్సి ఉంది. జనసేన, బిజెపి మధ్య తిరుపతి సీటు విషయంలో అవగాహన రావాల్సి ఉంది. తిరుపతి సమావేశం ద్వారా తిరుపతి సీటును తాము వదులుకోబోమని పవన్ కల్యాణ్ సంకేతాలు పంపినట్లయింది.