వ్యాఖ్యల చిక్కులు: నాగబాబుకు పవన్ కల్యాణ్ హెచ్చరికలు

By telugu teamFirst Published May 23, 2020, 3:23 PM IST
Highlights

తన సోదరుడు, పార్టీ నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చిక్కుల్లో పడేసినట్లే ఉన్నాయి. దాంతో ఆయన నాగబాబుకు పరోక్షంగా హెచ్చరికలు చేసినట్లు చెబుతున్నారు.

విజయవాడ: సోషల్ మీడియాలో తమ పార్టీ అధినేత, సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. నాగబాబు వ్యాఖ్యలపై ఆయన స్పష్టత ఇచ్చారు. సున్నితంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. సోషల్ మీడియాలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని ఆయన అన్నారు. 

నాగబాబు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధికార పత్రం ద్వారా వచ్చినవాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వ్యాప్తి వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, పార్టీ కార్యకర్తలు ప్రజా సేవ తప్ప ఇతర అంశాల జోలికి వెళ్లకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. క్రమశిక్షణ తప్పకుండా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.   

Also Read: గాంధీ బతికి ఉంటే.. నాగబాబు మరో షాకింగ్ ట్వీట్

"జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలేగానీ.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని మీకు తెలిపాం" అని పవన్ కల్యాణ్ అన్నారు. 

"ఈ మధ్యకాలంలో కూడా కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్ధులు వక్రీకరిస్తున్నందున మరోసారి ఈ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను" అని ఆయన అన్నారు. "పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులునాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

"పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నాము. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను" అని ఆయన అన్నారు.  

"ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరికీ ఒక మాట చెబుతున్నా... ఇది ప్రజలు అనుకోని కష్టాలను ఎదుర్కొంటున్న కాలం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరేతర అంశాల జోలికి వెళ్లవద్దని కోరుతున్నాను. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని పవన్ కల్యాణ్ వివరించారు..

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను సమర్థిస్తూ తొలుత ట్వీట్ చేసిన నాగబాబు దాంతో ఆగలేదు. తాజాగా మరో వివాదాస్పదమైన ట్వీట్ చేశారు.  ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అందరినీ ఉద్దేశించి సూచనలు చేసినప్పటికీ పరోక్షంగా తన సోదరుడు నాగబాబుకు సున్నితంగా హెచ్చరికలు చేసినట్లు భావిస్తున్నారు.

"ఇండియన్  కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ" అని నాగబాబు తాజాగా ట్వీట్ చేశారు.. 

click me!