
తెలుగుదేశంపార్టీలోని అసంతృప్తులను ఆకర్షించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్ నే వేసారు. ప్రతీ జిల్లాలోనూ పార్టీ అధినేత పై పలువురు నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం జగన్ గ్రహించారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు వ్యవహారశైలితో పాటు కుమారుడు లోకేష్ వ్యవహారం కూడా పలువురు నేతలకు మింగుడుపడటం లేదు. ఫిరాయింపుల్లో భాగంగా తమ వైరి వర్గాలను తీసుకొచ్చి బలవంతంగా తమపై రుద్దటాన్ని టిడిపిలోని పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికితోడు ఫిరాయింపు నేతలకే అన్నింటిలోనూ ప్రాధాన్యత లభిస్తుండటంతో అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వైసీపీని బలహీనపరచటంలో భాగంగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో టిడిపి నేతలకు ఫిరాయింపు నేతలు రావటం ఇష్టం లేదు. అదే విషయాన్ని తండ్రీ, కొడుకులకు ఆయా జిల్లాల్లోని నేతలు స్పష్టంగా చెప్పినా ఖాతరు చేయలేదు. దానికితోడు కొత్తగా పార్టీలో చేరిన నేతలు పాత నేతలపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూడటంతో ఆయా నియోజకవర్గాల్లో ఘర్షణలు మొదలయ్యాయ. చివరకు చంద్రబాబు కూడా వీరి మధ్య పంచాయితీ తీర్చలేని స్ధితికి విభేదాలు చేరుకున్నాయి.
అయితే ఇక్కడే చంద్రబాబు ఊహించని రీతిలో జగన్ భారీ స్కెచ్ వేసారు. తన ఎంఎల్ఏలను చంద్రబాబు లాక్కుంటే టిడిపిలోని అసంతృప్తులకు జగన్ గాలం వేసారు. దాంతో టిడిపి నేతలు వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్, భాజపాల్లోని గట్టి నేతలను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరి, విజయవాడ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లకు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు.
తాజాగా కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీలో చేరటానికి రంగం సిద్ధమైంది. అలాగే నంద్యాల నుండి శిల్పా సోదరులు, కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం నియోజకవర్గాలకు చెందిన టిడిపి అసంతృప్తులు కూడా త్వరలో వైసీపీ తీర్ధం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక, కడప జిల్లా జమ్మలమడుగులో దశాబ్దాల పాటు పార్టీనే అంటిపెట్టుకున్న రామసుబ్బారెడ్డి వర్గం కూడా త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని కాంగ్రెస్ తో పాటు టిడిపి అసంతృప్తులను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ భారీ స్కెచ్ వేయటంతో టిడిపి నాయకత్వం ఉలిక్కిపడుతోంది.