
నవంబర్ 6వ తేదీ నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయనున్న పాదయాత్రకు ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని నామకరణం చేసారు. రాష్ట్రంలోని 125 నియోజకవర్గాల్లో ఆరు మాసాల పాటు 3 వేల కిలోమీటర్లను పాదయాత్ర ద్వారా జగన్ కవర్ చేయాలని నిర్ణయించారు. సుదీర్ఘపాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను జగన్ ఎండగట్టనున్నారు. ప్రతీ జిల్లాలోనూ దాదాపు అన్నీ నియోజకవర్గాలను వీలైనంతలో టచ్ చేయాలని వైసీపీ నేతల సూచనలకు జగన్ సానుకూలంగా స్పందించారు.
వైసీపీ అదికారంలోకి రావటం వల్ల జనాలకు జరిగే మేళ్ళు ఏంటి అన్న విషయాలను జగన్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించారు. అందుకనే మొన్నటి ప్లీనరీ సమావేశాల్లో చేసిన తీర్మానాల్లో కీలకమైన నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం, గడపగడపకు వైసీపీ లాంటి కార్యక్రమాల గురించి కూడా జగన్ ప్రజలతో ప్రస్తావించనున్నారు.
పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలేంటి? వాటిల్లో ఎన్ని అమలయ్యాయి? వాటి లబ్దిదారులెవరు? ఆయా గ్రామాల్లో ఎంతమందికి ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల లబ్దిపొందుతున్నారు లాంటి అనేక విషయాలను ప్రస్తావించనున్నారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు వైఫల్యం, ప్రత్యేకహోదా సాధనలో విఫలమైన విధానం, రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ లో చూపటం లాంటి అనేక అంశాలను జగన్ లేవనెత్తుతారు.
తాను పాదయాత్ర చేస్తున్న జిల్లాల్లోని నేతలు తనతో పాటు పాల్గొంటారని, మిగిలిన జిల్లాల్లోని నేతలు అదే సమయంలో ఆయా జిల్లాల్లో యాత్రలు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయమైంది. అదే విధంగా తన యాత్రలో జగన్ వివిధ గ్రామాల్లోనే రాత్రిళ్ళు నిద్రించాలని, ఆయా గ్రామాల్లోని, మండల కేంద్రాల్లోని రాజకీయేతర ప్రముఖులను కలవాలని కూడా నిర్ణయమైంది.
మొత్తం మీద 125 బహిరంగ సభల్లో పాల్గొనాలని, ప్రజాసంఘాలతో 180 సమావేశాలు నిర్వహించాలని, 2 కోట్లమంది ప్రజలను నేరుగా కలవాలని, దారివెంబడే 5 వేలకు పైగా భేటీలు జరపాలని, 45 లక్షల కుటుంబాలను కలవాలని నిర్ణయించారు. 6 మాసాల ప్రజా సంకల్ప యాత్రకు వైసీసీ నేతలు భారీగానే ముందస్తు ఏర్పాట్లు చేసినట్లే అర్ధమవుతోంది.