
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయించింది. అంటే మరో ఏడాదిన్నర పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని వైసీపీ అధ్యక్షతన జరిగిన వైసీపీఎల్పీ సమావేశం గురువారం తీర్మానించింది. ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించాలని, ఫిరాయింపు మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించాలనే ప్రధాన డిమాండ్లతో అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించింది.
తమ ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించటమే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టటమే ఏకైక టార్గెట్ గా టిడిపి పెట్టుకుందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అసలు వైసీపీకి మైక్ కూడా ఇవ్వటం లేదట. తమ అధినేతకు మైక్ ఇవ్వన్నపుడు ఇక తాము మాట్లాడుతామన్నా ఎందుకు అనుమతిస్తారంటూ వైసీపీ ఎంఎల్ఏలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద ఫిరాయింపుల చేత రాజీనామాలు చేయించే వరకూ అసెంబ్లీ మెట్లెక్క కూడదని నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి అసెంబ్లీలో టిడిపికి ఎదురన్నదే లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఎందుకంటే, ఫిరాయింపులతో చంద్రబాబు రాజీనామాలు చేయించేది లేదు..వైసీపీ ఇక అసెంబ్లీకి హాజరయ్యేది లేదు. కాబట్టి భవిష్యత్ అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని టిడిపి నేతలు తమ ఇష్టం వచ్చినట్లు చెండాడుకోవచ్చు.
నిజంగా వైసీపీ నిర్ణయానికి ప్రజాస్వామ్యవాదులు సిగ్గుపడాలి. అయితే, అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి కాబట్టి అటువంటి ఛాయలేమీ కనబడటం లేదు. ఫిరాయింపులతో రాజీనామాలు చేయిస్తేనే తాము అసెంబ్లీకి వస్తామని వైసీసీ స్పష్టంగా ప్రకటిచింది. ఒకవైపు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతూనే ఇంకోవైపు అవసరం లేకపోయినా ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
అదే విషయాన్ని వైసీపీ ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులపై చర్యలు తీసుకోనందుకు చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ ను తప్పుపట్టారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పారు.