
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నందిగామ పోలిస్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై జగన్ పై ఆసుపత్రి సూపరెండెంట్ ఫిర్యాదు చేసారు. దాంతో జగన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. పెనుగంచిప్రోలు ముళ్ళపాడు వద్ద బస్సుప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 11 మంది మరణించగా సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు జగన్ అక్కడికి వెళ్లారు. అయితే, బాదితులను పరామర్శించటం వరకూ బాగానే ఉంది కానీ ఇక్కడే జగన్ అనుభవరాహిత్యం బయటపడింది.
మృతులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టులను డాక్టర్ వద్ద నుండి జగన్ తీసుకుని తిరిగి ఇచ్చేయకుండా తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. రిపోర్టులు కావాలని డాక్టర్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోగా వాగ్వాదానికి దిగారు. ఓవైపు డాక్టరేమో జిరాక్స్ కాపీలను ఇస్తామని చెప్పినా వినకుండా జగన్ ఒరిజనల్ రిపోర్టులను ఇవ్వటానికి నిరాకరించారు. దాంతో డాక్టర్-జగన్ మధ్య ఇదే విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. జగన్ వద్ద ఒరిజినల్ రిపోర్టులున్నా జిరాక్స్ అయినా ఒకటే. అదే డాక్టర్ వద్ద ఒరిజినల్ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తేఅవకాశాలున్నాయి. ఇంతచిన్న విషయాన్ని కూడా జగన్ ఆలోచించకుండా డాక్టర్ తో గొడవ పెట్టుకోవటమన్నది అనుభవరాహిత్యాన్ని స్పష్ట చేస్తోంది. పైగా అదే సమయంలో కలెక్టర్ బాబుతో కూడా అనుచితంగా మాట్లాడారు. సెంట్రల్ జైలుకు పంపుతానని బెదిరించటం ప్రతిపక్ష నేత స్ధాయికి తగదు.
ప్రభుత్వ వైఫల్యాలపై ఓవైపు ముఖ్యమంత్రితోనే పోరాటం చేస్తున్న జగన్ మరోవైపు జిల్లా కలెక్టర్ ను బెదిరించటం, డాక్టర్ తో వాగ్వాదానికి దిగటంతో తన స్ధాయిని తానే దిగజార్చుకున్నట్లైంది. కలెక్టర్ అయిన ఇంకోరైనా ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిందేనన్న సంగతి జగన్ తెలీదా? బాధితుల పరామర్శించిన తర్వాత అక్కడి నుండి జగన్ వచ్చేస్తే సరిపోయేది. పోస్టుమార్టం రిపోర్టు జిరాక్స్ కాపీలను తీసుకోమని ఇంకెవరికైనా పురమాయిస్తే సరిపోయేది. తనంతట తానుగా ప్రభుత్వానికి అస్త్రాన్ని అందించినట్లైంది. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఇదే విధంగా వ్యవహరించేవారు. అధికారులపై చర్యలు తీసుకుంటానని బెదిరించిన ఘటనలున్నాయి. అప్పుడు అధికారులు చంద్రబాబుకు ఎదురుతిరిగిన ఘటనలూ ఉన్నాయన్న సంగతి జగన్ మరచిపోకూడదు.
ఏదైనా దుర్ఘటన జరిగినపుడు బాధితులను పరామర్శించటం ప్రతిపక్ష నేత బాధ్యతే. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగని, విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో గొడవలు పడటం, బెదిరించటమన్నది ప్రతిపక్షనేత స్ధాయికి తగదు.