
జరగబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల ఉపఎన్నికే నాందిగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి తరపున నంద్యాల ఉపఎన్నికలో ప్రచారానికి జగన్ గురువారం శ్రీకారం చుట్టారు. స్ధానిక ఎస్పీజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రజలు ధర్మం పక్షాన నిలబడితే చాలన్నారు. ప్రజలెవరూ యుద్ధం చేయక్కర్లేదని ఓటింగ్ సమయంలో వైసీపీకి మద్దతుగా మీట నొక్కితే చాలన్నారు.
వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలను ఎత్తుకెళ్లిన చంద్రబాబును దొంగంటారా? లేక ముఖ్యమంత్రంటారా? అంటూ నిలదీసారు. పిల్లనిచ్చిన సొంతమామ ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని, మిగిలిన పార్టీలో చిచ్చుపెట్టే వ్యక్తిని, వాడుకుని వదిలేసే వ్యక్తిని ఏమంటారు అంటూ జగన్ పదే పదే వేసిన ప్రశ్నలకు జనాలు పెద్దఎత్తున స్పందించారు. వైసీపీ గనుక నంద్యాలలో పోటీ పెట్టకపోతే అసలు ఇక్కడ అభివృద్ధే జరిగేది కాదన్నారు. ఉపఎన్నిక అనివార్యమైన దగ్గర నుండి చంద్రబాబునాయుడు, లోకేష్ ఇద్దరూ నంద్యాల వీధుల్లోనే తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేసారు.
చంద్రబాబు పాలన ఎలాగుందో జనాలనే అడిగి చెప్పించారు. అవినీతి, అక్రమాల చంద్రబాబు ప్రభుత్వాన్ని దింపేయాల్సిన సమయం దగ్గరకు వచ్చిందన్నారు. మైనారిటీలకు మూడేళ్ళుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ఆరోపించారు. రైతులకు రుణమాపీ చేయకుండా వెన్నుపోటు పొడిచినట్లు ధ్వజమెత్తారు. డ్వక్రా మహిళలనే కాదు సమాజంలోని ప్రతీ వర్గాన్నీ చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారన్నారు. కాపులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చివరకు నంద్యాల ఉపఎన్నికలో పవన్ కల్యాణ్ ను వాడుకుంటున్నట్లు ఎద్దేవా చేసారు.
ఇసుక నుండి రాజధాని భూముల వరకూ విపరీతమైన అవినీతి చేసి ఎన్నికలొచ్చేసరికి నీతులు గురించి మాట్లాడుతారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా విరమణ చేయించే విధంగా అబద్దాలు చెబుతున్నట్లు దుయ్యబట్టారు. ఒక్క ముస్లింకు కూడా చంద్రబాబు క్యాబినెట్లో చోటు కల్పించలేదన్నారు. మొన్నటి వరకూ ఫరూక్ కు అసలు చంద్రబాబు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కేవలం నంద్యాల ఉపఎన్నిక వచ్చింది కాబట్టే ఓ ఎంఎల్సీ అయినా ఇచ్చారంటూ చెప్పారు.