అణుబాంబుల దాడి కంటే ప్రమాదకరం జగన్ పాలన...: మాజీ మంత్రి యనమల

By Arun Kumar PFirst Published Apr 15, 2021, 5:03 PM IST
Highlights

వైసిపి పాలకులు ప్రజాస్వామ్యానికి పాతరేసి... రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

తిరుపతి: అరాచకాలు, అకృతాయలు, అవినీతే లక్ష్యంగా ముందుకెళ్తున్న వైసీపీ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలని తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. వైసిపి పాలకులు ప్రజాస్వామ్యానికి పాతరేసి... రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. రెండేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదన్నారు యనమల.

''రెండేళ్ల క్రితం వరకు అభివృద్ధిలో, పారదర్శకతలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని నేడు అట్టడుగు స్థానానికి పడదోశారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను కుదించి అన్యాయం చేశారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అణుబాంబుల దాడి కంటే అవినీతి పరుల పాలన అత్యంత ప్రమాదకరమని ప్రజలు తెలుసుకోవాలి. అవినీతితో రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలివేటు వేసిన వారికి బుద్ధి చెబుదాం'' అని సూచించారు.

read more  జగన్ జాంబీరెడ్డి, అనపర్తిలో యాక్టర్ సూర్యానారాయణ రెడ్డి.. వీరిద్దరికి చిప్పకూడు ఖాయం: లోకేశ్

''ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి దోపిడీకి మార్గం వేశారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.6,500 కోట్లు దోచుకున్నారు. మద్య నిషేధం మాటున రూ.25వేల కోట్ల కమిషన్లు దండుకుంటున్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారు. విశాఖలో భూ కబ్జాలు చేస్తున్నారు. స్కీం ప్రారంభానికి ముందే స్కాం రూపొందించి రాష్ట్రాన్ని పక్కాగా దోచుకుతింటున్నారు'' అని ఆరోపించారు.

''రాష్ట్రానికి ఏం మేలు చేశారని వైసీపీకి ఓటు వేయాలి? 22 మంది ఎంపీలుండి కూడా కేసుల కోసం కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి. ఇప్పుడు మరో ఎంపీని పంపితే.. మోడీ కాళ్లు పట్టుకోవడానికి మరో వ్యక్తి జతకలుస్తారే తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం నడుంబిగించి పోరాడుతున్నారు. అలాంటి వారికి మరో వ్యక్తి తోడైతే రాష్ట్రం కోసం కేంద్రం వద్ద పోరాడేందుకు మరింత బలం అందుతుంది. ఓటు వేసే ముందు ప్రతి పౌరుడు బాధ్యతతో ఆలోచించండి. రాష్ట్ర అభివృద్ధికి మీ వంతుగా పోరాడండి'' అని మాజీ ఆర్థిక మంత్రి యనమల సూచించారు. 

click me!