తిరుపతిలో ఓటుకు రెండు వేలు... రూ100కోట్లు సిద్దం..: బిజెపి విష్ణువర్ధన్

By Arun Kumar PFirst Published Apr 15, 2021, 4:50 PM IST
Highlights

తిరుపతి ఉప ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులే బెదిరిస్తే ఇంకా ఎవరికి పిర్యాదు చేయాలి? అని విష్ణువర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

తిరుపతి: తిరుపతి పార్లమెంట్ పరిధిలో బిజెపి ఏజెంట్లను అధికార పార్టీ నేతలు పోలీసులను ఉపయోగించుకుని బెదిరిస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ .విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇది అధికార పార్టీ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులే బెదిరిస్తే ఇంకా ఎవరికి పిర్యాదు చేయాలి? అని విష్ణువర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

'తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకే వైసిపి రూ.100 కోట్లు సిద్దం చేసింది. ఓటుకు రెండు వేలు పంచి అయినా గెలవాలని వైసిపి పన్నాగం పన్నుతోంది. కానీ మీకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారు'' అని విష్ణువర్ధన్ హెచ్చరించారు. 

read more  తిరుపతి బైపోల్: గురుమూర్తి మతంపై వివాదం.. హిందువో, కాదో చెప్పాలంటూ జీవీఎల్ డిమాండ్

మరో బిజెపి నాయకులు సీఎం రమేష్ మాట్లాడుతూ... తమ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పథకాలు ఆపేస్తున్నారని వైసిపి మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రభుత్వ దౌర్జన్యానికి, అవినీతికి అడ్డుకట్ట పడాలన్నా బిజెపికి ఓటు వేయాలని సూచించారు. 

మరో ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ...స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ రాయలసీమ కరువు ప్రాంతంగానే వుందన్నారు. ఇక్కడినుండి ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి అయ్యారు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రాయలసీమ ప్రాంతంలో లీడర్ షిప్ వుంది కానీ అభివృద్ధి లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే రాయలసీమ కోసం పోరాడే వ్యక్తి గా నిలబడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే బిజెపినీ గెలిపించాలని టిజి తిరుపతి ప్రజలకు సూచించారు. 

  

click me!