
చాలా కాలం తర్వాత దొరికిన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను వైసీపీ అధినేత జగన్ పూర్తిగా ఉపయోగించుకున్నట్లే కనబడుతోంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలౌతోందో లెక్కలతో సహా వివరించి చెప్పారు. జగన్ చెప్పటం సరే, ప్రధాని కూడా దాదాపు గంటసేపు పూర్తిగా వినటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందన్న విషయమై సర్వత్రా ఆశక్తి నెలకొంది.
ప్రధానితో తాను సమారు గంటసేపు అనేక విషయాలపై వివరించానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం నాడు అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానంపై ఈరోజు ప్రజాప్రతినిధులు, నేతలతో జగన్ సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు, కొడుకు లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నదీ పూర్తిగా ప్రధానమంత్రికి వివరించినట్లు చెప్పారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిలో ఏ విధంగా నెంబర్ 1 స్ధానానికి చేరుకున్నది చెప్పానన్నారు. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతిపై కాగ్ తో కలిపి పలు సంస్ధలు విడుదల చేసిన నివేదికలను కూడా అందచేసినట్లు జగన్ పేర్కొన్నారు. వ్యవస్ధలను చంద్రబాబు ఏ విధంగా మ్యానేజ్ చేస్తున్నారన్న విషయాన్ని పూర్తిగా వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలని చూస్తున్న చంద్రబాబు కుట్రను కూడా చెప్పానన్నారు.
ముఖ్యమంత్రి అధికారదుర్వినియోగంపై విచారణ జరిపించమని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత ప్రధానిని కలవ కూడదా? కలవటంలో ఏం తప్పుందని చంద్రబాబు బాధపడిపోతున్నారో తనకు అర్ధం కావటం లేదన్నారు. చంద్రబాబు ప్రధానికి దృష్టకి తీసుకెళ్ళాల్సిన అనేక అంశాలను తాను ప్రధానితో ప్రస్తావించినట్లు జగన్ చెప్పారు. టిడిపి దృష్టిలో మొన్నటి బ్రహ్మాండంగా ఉన్న నరేంద్రమోడి జగన్ ను కలిసే సరికి ఒక్కసారిగా అంటరాని వాడైపోయారా అంటూ మండిపడ్డారు.