
రాష్ట్ర పార్టీ వ్యవహారల నుండి జాతీయ నాయకత్వం వెంకయ్యనాయుడును దూరంగా పెట్టేసిందా? పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో టిడిపి-భాజపాల మధ్య పొత్తు కుదిరిందంటే అది కేవలం వెంకయ్య చలవే. అంతకుముందు నరేంద్రమోడి గురించి చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లు, మాట్లాడిన మాటలు స్ధానిక భాజపా నేతలు మోడికి స్పష్టంగా మోసేసారు. దాంతో చంద్రబాబును మోడి పెద్దగా పట్టించుకోలేదు. దేశమంతా మోడి హవా బాగుందని గుర్తించిన తర్వాతే చంద్రబాబు వెంటపడీ మరీ మోడితో పొత్తు పెట్టుకున్నారు. అందుకు వెంకయ్యనే ప్రయోగించారు చంద్రబాబు
సరే, మొత్తానికి ఎన్నికల్లో ఇరుపార్టీలు లబ్దిపొందాయి. సమస్య అక్కడే మొదలైంది. చంద్రబాబు రాష్ట్రంలో భాజపాను ఎదగనీయకుండా చేస్తున్నారని ఆరోపణలు మొదలయ్యాయి. పైగా అందుకు వెంకయ్య సహకరిస్తున్నారంటూ కొందరు భాజపా నేతలు జాతీయ నాయకత్వానికి పదే పదే నివేదికలు పంపారు. అందుకు తగ్గట్లే భాజపా కూడా మూడేళ్ళల్లో పెద్దగా బలపడింది కూడా లేదు. అంతెందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా హరిబాబు స్ధానంలో సోమువీర్రాజును ఎంపిక చేసి కూడా నియమించలేకపోతోంది జాతీయ నాయకత్వం. అందుకు వెంకయ్యే కారణమని పార్టీ నేతలే చెబుతున్నారు. సోము అంటే చంద్రబాబుకు పడదని అందుకనే సోము వీర్రాజు నియామకాన్ని వెంకయ్య అడ్డుకుంటున్నట్లు పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతూనే ఉన్నారు.
ఇటువంటి నేపధ్యంలోనే అనంతపురంలో తాజాగా రాష్ట్ర పథాధికారుల సమావేశం జరిగింది. ఢిల్లీ నుండి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సిద్దార్ధనాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పార్టీ 100 సీట్లు గెలుచుకోవాలని నిర్ణయించటం గమనార్హం. సమావేశంలో అనుకున్నట్లు 100 సీట్లు గెలుపు సాధ్యమా కాదా అన్నది వేరే సంగతి. సొంతంగా 100 సీట్లు గెలవాలని ఆలోచించటమే గొప్ప. ఎందుకంటే, సొంతంగా 100 సీట్లలో గెలవాలంటే, మరి టిడిపి పరిస్ధితి ఏమిటి? ఇరు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తేనే కదా భాజపాకు 100 సీట్లు గెలుచుకునే అవకాశం వచ్చేది. పొత్తు ఉంటే మళ్ళీ టిడిపికి తోకపార్టీనే కదా భాజపా?
సమావేశంలో బూత్ స్ధాయి నుండి పార్టీని బలోపేతం చేయటం, 100 సీట్లలో గెలవటమన్నది గమనించాల్సిన అంశాలు. అంటే వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉండదని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లే కనబడుతోంది. జాతీయ నాయకత్వం అలా నిర్ణయిస్తే మరి వెంకయ్య ఏం చేస్తున్నట్లు? వ్యవహారం చూస్తుంటే రాష్ట్ర పార్టీ వ్యవహారాల నుండి జాతీయ నాయకత్వం వెంకయ్యను దూరంగా పెడుతోందన్న ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, త్వరలోనే భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులవ్వటం కూడా ఖాయమేనని సమాచారం.
అంటే, రానున్న కాలంలో మిత్రపక్షం కాస్త ప్రతిపక్షం అవుతుందేమో చూడాలి. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు కనబడటం ఖాయం. ఎందుకంటే, చంద్రబాబు మీదున్న ఆరోపణలకు జీవం వస్తుందేమో. పాపం, అప్పుడు వెంకయ్య పరిస్ధితి ఎలాగుంటుందోనని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి.