కమీషనర్ పై దాడి చాలా చిన్నది......కాల్వ

First Published Mar 27, 2017, 7:04 AM IST
Highlights

కాల్వ చెప్పేసారు కాబట్టి ఇంకెవరూ ఆ విషయాన్ని మట్లాడేందుకు లేదన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం.

‘గిల్లితే గిల్లిచ్చుకోవాలి..అరవకూడదు’. ‘కొడితే కొట్టిచ్చుకోవాలి’ అని పోకిరి సినిమాలో డైలాగుంది. టిడిపి నేతల వ్యవహారం అదేవిధంగా ఉంది. రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంపై అధికార పార్టీ నేతల దాడి వ్యవహారం చాలా చిన్నదట. జరిగిన ఘటనపై ప్రభుత్వ ఛీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అలాగే చెబుతున్నారు మరి. కాల్వ చెప్పేసారు కాబట్టి ఇంకెవరూ ఆ విషయాన్ని మట్లాడేందుకు లేదన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. చిన్న విషయాన్ని పెద్ద వివాదం చేయటం దారుణమని, తమ్ముళ్ళు సారీ చెప్పారు కాబట్టి అంతా అయిపోయినట్లేనని కూడా కాల్వ చెప్పటం దారుణమో.

ఓ వ్యక్తిగత విషయంలో విజయవాడ ఎంపి కేశినేని నాని, విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బోండాఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్నలు రవాణాశాఖ కమీషనర్, డిటిసిలను బహిరంగంగా దుర్బాషలాడారు. కమీషనర్ భద్రతా సిబ్బందిపై ఉమ చేయిచేసుకోవటం సంచలనమైంది. విషయం బాగా పెద్దదయిపోవటంతో చేసేది లేక చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడారు. అంతే మ్యాటర్ సెటిల్డ్. నిజానికి లోపల ఏం జరిగిందో తెలీదు. నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారని ప్రచారం చేయించారు.

దానికి తగ్గట్లే ఎంపి, ఎంఎల్సీ, ఎంఎల్ఏలు కూడా కమీషనర్ కు క్షమాపణ చెబుతున్నట్లే మీడియాకు తెలిపారు. దాంతో వివాదం మొత్తం సమసిపోయిందని టిడిపి మొదలుపెట్టింది. అక్కడే వైసీపీ విషయాన్ని అందుకున్నది. కమీషనర్ బహిరంగంగా అవమానపరచిన నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ మొదలుపెట్టారు. జిల్లాలోని నేతలు విజయవాడలో ప్రదర్శనలు మొదలుపెట్టేసారు. అసెంబ్లీ ప్రాంగణంలో చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భస్కరరెడ్డి దీక్షకు దిగారు. అయితే, చెవిరెడ్డిని అసెంబ్లీ మర్షల్స్ అరెస్టు చేసి మంగళగిరి పోలీసుస్టేషన్ కు తరలించారనుకోండి అది వేరే సంగతి. అయితే, ఈ విషయాన్ని వైసీపీ తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు. ఎందుకంటే, పై ముగ్గురు నేతల వ్యవహారం మొదటినుండి వివాదాస్పదమే. గతంలో కూడా ఎందరో అధికారులపైన, ప్రభుత్వ సిబ్బందిపైన దాడులు చేసిన ఘటనలున్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా రవాణాశాఖలోని ఉద్యోగులు బాగా మండిపోతున్నారు. ముందు ముందు ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

click me!