ఒక క్రీడా విధానమంటూ లేదా?

First Published Jun 29, 2017, 9:14 AM IST
Highlights

ఆస్ట్రేలియా ఓపెన్ లాంటి కమర్షియల్ టోర్నమెంట్లలో విజేతలకు డబ్బుకు కొదవుండదు. ఇటువంటి టోర్నమెంట్లు ఏడాదికి పది జరుగుతూంటాయి. మళ్ళీ ప్రభుత్వాలు ఎందుకు భారీగా నగదు ఇస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. క్రీడాకారులను ప్రోత్సహించాలంటే డబ్బు ఇవ్వటం కాదు చేయాల్సింది.

ఆస్ట్రేలియా ఓపెన్లో గెలిచిన కిడాంబి శ్రీకాంత్ కు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకాలు ప్రకటించటంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా ఓపెన్లో విన్నరైనందుకు కిడాంబిని చంద్రబాబు ఘనంగా సన్మానించారు. సన్మానం సందర్భంగా కిడాంబిపై ప్రభుత్వం ప్రకటించిన వరాలజల్లుపై అందరూ చంద్రబాబును విమర్శిస్తున్నారు.

ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ లో గెలిచినందుకు రూ. 50 లక్షలు, వెయ్యి గజాల స్ధలం ఇవ్వటం పట్ల పలువురు ఆక్షేపిస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ గెలవటం నిజంగా గొప్పే. ఆ విషయాన్ని ఎవరూ కాదనటం లేదు. కానీ కిడాంబి గెలిచింది ఓ కమర్షియల్ టోర్నమెంట్ అన్న సంగతి మరవకూడదు. ఏ కమర్షియల్ టోర్నమెంట్లో గెలిచినా విజేతలకు కావాల్సినంత డబ్బు వస్తుంది. మళ్ళీ రాష్ట్రప్రభుత్వం లక్షలకు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఘనంగా సన్మానం చేస్తే సరిపోతుంది. లేకపోతే ఓ ఉద్యోగం ఇచ్చినా ఎవరికీ ఇబ్బంది ఉండదు.

మొన్ననే ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్  గెలిచిందని పివి సింధుకు తెలుగు రాష్ట్రాలు కోట్లాది రూపాయలు, ఇళ్ళ స్ధలాలు, ఉద్యోగాలు ఆఫర్ చేసాయి. అప్పట్లోనే ప్రభుత్వాలు పోటీ పడటంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఒలంపిక్స్, ఏషియాడ్ లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రభుత్వాలు సన్మానం చేసి నగదు ప్రోత్సాహకాలు అందించాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఇక్కడ కేవలం మెడల్ మాత్రమే వస్తుంది. మెడల్ గెలిచారంటే దేశానికే ప్రతిష్ట. డబ్బు ప్రస్తావన ఉండదు. కాబట్టి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించినా తప్పులేదు.

కానీ ఆస్ట్రేలియా ఓపెన్ లాంటి కమర్షియల్ టోర్నమెంట్లలో విజేతలకు డబ్బుకు కొదవుండదు. ఇటువంటి టోర్నమెంట్లు ఏడాదికి పది జరుగుతూంటాయి. మళ్ళీ ప్రభుత్వాలు ఎందుకు భారీగా నగదు ఇస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. క్రీడాకారులను ప్రోత్సహించాలంటే డబ్బు ఇవ్వటం కాదు చేయాల్సింది. ఒక విధానం ప్రకారం క్రీడలబివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే క్రీడలభివృద్ధి జరుగుతుంది.

click me!