రాష్ట్రంలో తాలిబన్ పాలన తెస్తారా ?

First Published Jun 8, 2017, 8:51 AM IST
Highlights

అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు నిజంగానే పోరాటం చేయాలంటే అది ముందు తన పార్టీ, ప్రభుత్వంలోని పెద్ద తలకాయల నుండే మొదలుపెట్టాలి. పట్టిసీమలో సుమారు రూ. 500 కోట్ల అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కాగ్ చెప్పింది నిజం కాదా? అందుకు బాధ్యులెవరు? ఎవరిపై చర్యలు తీసుకున్నారు?

చంద్రబాబునాయుడు రాష్ట్రంలో తాలిబన్ తరహా విధానాలను అమలు చేయాలని అనుకుంటునట్లుంది. నవనిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబునాయుడు బుధవారం చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. లంచాలు తీసుకున్న వారిని ప్రజల సమక్షంలోనే శిక్షిస్తారట. తీసుకున్న లంచాలను తిరిగి ఇచ్చేయకపోతే జూలై నుండి బహిరంగ శిక్షలు అమలు చేస్తారట. పైగా అటువంటి వారికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదంటూ చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చ మొదలైంది.

అవినీతిపరులను సమర్ధించవద్దన్నారు. అంత వరకూ బాగానే ఉంది. వారిని ఛీ కొట్టాలట. సమాజానికి దూరంగా పెట్టాలట. సామాజిక సంపదను దోచుకోవటం మహాపాపమట. అది ప్రజల సంపద కాబట్టి ప్రజలకే చెందాలట. అవినీతీకి పాల్పడమని ఎవరు ఎవరికీ చెప్పరు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ఇప్పటి వరకూ వెలుగు చూసిన అవినీతి చిరుద్యోగులకు సంబంధించినది మాత్రమే.

అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు నిజంగానే పోరాటం చేయాలంటే అది ముందు తన పార్టీ, ప్రభుత్వంలోని పెద్ద తలకాయల నుండే మొదలుపెట్టాలి. పట్టిసీమలో సుమారు రూ. 500 కోట్ల అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కాగ్ చెప్పింది నిజం కాదా? అందుకు బాధ్యులెవరు? ఎవరిపై చర్యలు తీసుకున్నారు? ఇక, పోలవరం ప్రాజెక్టుతో పాటు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచేయటం అవినీతి కాదా?

తాజాగా ప్రభుత్వాన్ని, పార్టీని కుదిపేస్తున్న విశాఖపట్నం జిల్లాలో బయటపడిన భారీ భూ కుంభకోణంలో పాత్రదారులెందరు? అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధృవీకరించారు కదా? వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలో నాసిరకం నిర్మాణాలు చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు? నాసిరకం నిర్మాణాల వల్ల ప్రభుత్వం పరువంతా పోయింది కదా? మరి, అందుకు బాధ్యులను ఏం చేయాలి?

తానే దేశంలో అత్యంత సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తప్పు చేసిన వారికి ఇన్ స్టంట్ శిక్షలు విధించటం మనదేశంలో సాధ్యంకాదని తెలీదా? అటువంటి తరహా శిక్షలు డిక్టేటర్, తాలిబన్ తరహా పాలనలోనే సాధ్యం. మనకి ఓ చట్టం, ఓ రాజ్యాంగం ఉంది. ఎవరినైనా వాటికి లోబడే చర్యలు తీసుకోవాలి. ఆ విషయాలు తెలిసీ చంద్రబాబు భిన్నంగా మాట్లాడుతున్నారంటే, కేవలం జిమ్మిక్కులనే భావించాలి.

click me!