వర్షం లీకేజీలో కుట్రా ?

First Published Jun 7, 2017, 4:04 PM IST
Highlights

స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రత్యక్షంగా పరిశీలించారు. అసెంబ్లీ భవనం మొత్తాన్ని కలియతిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లీకేజీలపై సిఐడితో విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించారు.

వర్షపు నీటి లీకేజీల్లో కుట్రకోణమా? విచిత్రంగా ఉన్నా వాస్తవమిదే. ఎందుకంటే, మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం భవనాల్లోకి వర్షపునీరు లీకైంది. చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రికార్డు సమయంలో, రూ. 900 కోట్లు పెట్టి కట్టించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం భవనాల్లోకి వర్షపు నీరు లీకైంది. ఫలితంగా పలు బ్లాకుల్లోని రికార్డలు, ఫర్నీచర్ పాడైపోయాయి.

అదే విషయాన్ని బుధవారం మధ్యాహ్నం స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రత్యక్షంగా పరిశీలించారు. అసెంబ్లీ భవనం మొత్తాన్ని కలియతిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లీకేజీలపై సిఐడితో విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించారు. నీటి లీకేజీలకు సిఐడికి ఏంటి సంబంధమని అడక్కడండి అదంతే. 20 నిముషాల వర్షానికి భవనంలోపలంతా కురిసిందంటే నాణ్యత ఎంత నాశిరకంగా ఉందో అర్ధమైపోతోంది. ఇంతోటి నాశిరకం నిర్మాణాలకు చంద్రబాబు రూ. 900 కోట్లు ఖర్చు చేసారు.

తాజాగా స్పీకర్ మాట్లాడుతూ, వర్షపు నీటి లీకేజీల్లో కుట్రకోణం ఉందేమోనని అనుమానిస్తున్నారు. అందుకే సిఐడితో విచారణ జరిపిస్తారట. పైపును కట్ చేయటం వల్లే భవనాల్లోకి వర్షపు నీరు లీకైనట్లు కోడెల చెప్పారు. ఆ పైపు ఎలా కట్ అయిందన్న విషయమే తేలాలట. మళ్ళీ సచివాలయం భవనాలు లీకేజికి సిఐడి విచారణకు సంబంధం లేదట. ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారట.

అసలు 24 గంటలూ భద్రత ఉండే అసెంబ్లీ భవనం పైకి వెళ్ళి పైపు లు ఎవరు కట్ చేస్తారబ్బా? ఒకవేళ ఎవరైనా కట్ చేసినా మరి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు? కుట్రకోణం పక్కన బెడితే, అసలు నిర్మాణాల నాణ్యతలోనే లోపం ఉందని తేలితే కోడెల ఏం చేస్తారు? దాన్ని కప్పి పుచ్చుకునేందుకు తప్పంతా వర్షానిదే అని తేలుస్తారా? లేకపోతే నీటి లీకేజి కూడా వైసీపీ కుట్ర అనే అంటారా?  చూద్దాం విచారణలో ఏం తేలుతుందో?

 

click me!