
అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి వైసీపీ వైపు చూస్తున్నారా? తాజాగా జెసి చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు మొదలయ్యాయి. వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నారంటే టిడిపిలో ఇమడలేకపోతున్నారట. మొన్నటి వరకూ జగన్ తనకు ఆగర్భశతృవైనట్లు వ్యవహరించిన జెసి తాజాగా జగన్ను బలమైన ప్రతిపక్ష నేతగా బహిరంగ వేదికపైనే అంగీకరించటమే అనుమానాలను బలపరుస్తోంది.
దానికితోడు అనంతపురం ఎంపిగా పోటీ చేసే ఉద్దేశ్యంతోనే జెసి కొడుకు జగన్ తో మొదటి నుండి టచ్ లో ఉన్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని జెసి ఆమధ్య ప్రకటించారట.
సరే, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే, జెసి ఏంటి జగన్ను బలమైన ప్రతిపక్ష నేతగా బహిరంగంగా అంగీకరించటమేంటి? అన్న విషయంపైనే టిడిపిలో కుడా చర్చ మొదలైంది. ఏ రాజకీయ నేతగా కుడా ఊరికే మనసులోని మాటను బయటపెట్టేయరుకదా? ఏదన్నా ప్రకటన చేసారంటే దాని వెనుక ఏదో పెద్ద ప్లానే ఉంటుందనటంలో సందేహం అకర్లేదు. అందుకనే జెసి వ్యాఖ్యల వెనుక కూడా ఏదో ప్లాన్ ఉందనే అనుమానాలు జోరందుకున్నాయ్.
ఇంత హటాత్తుగా జెసి వ్యాఖ్యలు చేయటం వెనుక కారణాలపైనే అందరూ చర్చించుకుంటున్నారు. జిల్లాలో చంద్రబాబునాయుడు సామాజికవర్గ ఆధిపత్యం నడుస్తోంది. దాన్ని జెసి సహించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టిడిపి నుండే జెసి కుంటుంబంలో ఎవరెక్కడ పోటీ చేసినా టిడిపి అభ్యర్ధులు, నేతల నుండి సహకారం అందేది అనుమానమే. దాంతో జెసిలో ఒకవిధమైన ఫ్రస్ట్రేషన్ మొదలై పార్టీలో ఇమడలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇటువంటి నేపధ్యంలోనే బుధవారం జరిగిన గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటి ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అవకాశంగా తసుకున్నారు. అక్కడ మాట్లాడుతూ, తనకు కులపిచ్చి ఉందని చెప్పుకోవటం, జగన్ను బలమైన ప్రతిపక్షగా అంగీకరించటం వ్యూహాత్మకమేనంటున్నారు. ఒకవేళ జెసి సోదరులు టిడిపి నుండి బయటకు వచ్చేసినా వైసీపీలో చేరటం అంత సులభం కాదు.
ఎందుకంటే, తాడిపత్రి అసెంబ్లీ, అనంతపురం ఎంపి సీటులో పోటీ చేయటమే వారి లక్ష్యం. అయితే, ఇప్పటికే పై స్ధానాల్లో వైసీపీకి గట్టి అభ్యర్ధులున్నారు. పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని జెసి సోదరులను జగన్ ఆధరిస్తారా అన్నది సందేహమే. కాబట్టి, ఏ జరుగుతుందో చూడాలి.