బీజేపీ విధానాలపై పోరాటానికి జగన్ నిర్ణయం

First Published Dec 15, 2017, 10:13 AM IST
Highlights
  • భారతీయ జనతా పార్టీ విషయలో వైసిపి తన వైఖరి మార్చుకుంటోందా?

భారతీయ జనతా పార్టీ విషయలో వైసిపి తన వైఖరి మార్చుకుంటోందా? ఇంతకాలం వివిధ కారణాల వల్ల వైసిపి, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసిందేమీ లేదు. జగన్ పై ఉన్న కేసులు కావచ్చు, లేదా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కావచ్చు కేంద్రం విధానం పట్ల వైసిపి మౌనం వహించింది. అటువంటిది కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తాము పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హటాత్తుగా చెప్పటం చూస్తుంటే పార్టీ వైఖరి మారిందా అనే సందేహాలే వస్తున్నాయి.

విజయసాయి మాట్లాడుతూ, కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న ఎఫ్‌డీఆర్‌ఐ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు. శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ,  భాజపా చేపడుతున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. లాభాలను ఆర్జించే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. కేంద్రం ప్రైవేటీకరించనున్న డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) అంశాన్ని మరోసారి పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఎఫ్‌డీఆర్ఐ చట్టంతో డిపాజిటర్లకు తీవ్రనష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేకమన్నారు. ఈ చట్టంపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా డిసిఐను ప్రైవేటీకరించటం సరికాదని విజయసాయి అభిప్రాయపడ్డారు. నేవీ, రక్షణ శాఖ కోసం పనిచేస్తున్న డీసీఐలోని 1500 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఆందోళనలో పడిందన్నారు. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసారు. గతంలో పార్లమెంట్ సాక్షిగా మంత్రి డిసిఐ ప్రైవేటీకరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రమంత్రులు ప్రకటించిన విషయాన్ని రాజ్యసభ సభ్యుడు గుర్తు చేసారు.

click me!