
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారా? తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. వైసీపీ కేంద్రంలో భాగస్వామి కాదు. అయినా రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్ధికి జగన్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో చేసిన వ్యాఖ్యలే పలువురి అనుమానాలకు ఊతమిస్తున్నాయి.
జగన్ ఎన్డీఏతో త్వరలో జత కడుతారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. జగన్ ఎన్డీఏలో చేరితే మరి ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం పరిస్ధితి ఏమిటి? ఈ ప్రశ్నే పలువురిని ఉత్కంఠతకు గురిచేస్తోంది. నిజానికి పేరుకు భాగస్వామే అయినా రాష్ట్ర ప్రయోజనాలను టిడిపి కాపాడలేకపోతోంది. రాష్ట్ర విభజనలో పేర్కొన్న రెవిన్యూలోటు భర్తీ, ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వోజోన్ అంశాల సాధనలో విఫలమవ్వటమే ఇందుకు నిదర్శనం.
ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఉపయోగం లేనపుడు ఇంకెందుకు కొనసాగాలంటూ టిడిపిలో బాహాటంగానే చర్చ జరుగుతోంది. అయితే, సిఎం అయిన కొత్తలో చంద్రబాబు ఇరుక్కున్న ‘ఓటుకునోటు’ కేసే ఇక్కడ కీలకం. కేంద్రానికి సరెండర్ అయిన కారణంగానే చంద్రబాబుపై కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదు. కేసు విచారణ జరిగివుంటే ఈపాటికి చంద్రబాబు పరిస్ధితి ఏమిటో ఊహించుకోవచ్చు. అందుకనే ఎందరూ భాజపాతో పొత్తును వ్యతిరేకిస్తున్నా మాట్లాడకుండా ఎన్డీఏలో కొనసాగుతున్న విషయం గమనార్హం.
అదే సమయంలో జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైపోతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ తో పాటు భాజపా రాష్ట్ర నేతలు కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి అందచేస్తున్నారు. దాంతో కేంద్రం కూడా చంద్రబాబు పట్ల పెద్దగా ఆశక్తి కనబరచటం లేదని భాజపా నేతలంటున్నారు.
సరిగ్గా ఈ సమయంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఏ కారణంగానైనా చంద్రబాబు ఎన్డీఏ నుండి వైదొలగితే ఆ స్ధానాన్ని తాను భర్తీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు భాజపా జాతీయ నాయకత్వానికి ఫీలర్లు పంపినట్లు ప్రకారం జరుగుతోంది. ఈ విషయంపైనే భాజపా కేంద్ర నాయకత్వం కూడా ఆలోచిస్తోందట.
బహుశా ఈ ఏడాది చివరలో ఈ విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకన్నా మంచిదనే వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందంటూ భాజపా నేతలతో కేంద్ర నాయకత్వం ప్రకటనలు చేయిస్తోందని కూడా పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకవేళ జగన్ గనుక ఎన్డీఏలో చేరటం ఖాయమైతే చంద్రబాబుకు కష్టాలు మొదలైనట్లే.