డల్లాస్ మెయిల్స్ పై దర్యాప్తు మొదలు

First Published May 11, 2017, 4:17 AM IST
Highlights

అమెరికాలోని టిడిపి ఎన్ఆర్ఐ విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇర్వింగ్ పోలీసులు కేసు నమోదు చేసారు. మెయిల్స్ వెనుక ఎవరి హస్తముందో తేల్చేందుకు దర్యాప్తు కూడా మొదలుపెట్టారు.

డల్లాస్ మెయిల్స్ పై అమెరికాలోని ఇర్వింగ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా మెయిల్స్ రూపంలో పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే కదా? డల్లాస్ లో పర్యటిస్తుండగా చంద్రబాబుకు  వ్యతిరేకంగా పోలీసులకు ఈ-మెయిల్స్ అందాయి.

దాంతో అటు అమెరికాతో పాటు ఇతర ఆంధ్రలో కూడా కలకలం మొదలైంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయటమంటే రాష్ట్రప్రభుత్వం పరువును బజారున పడేయటమే అంటూ టిడిపి మండిపడుతోంది. అమెరికాలో కూడా రాష్ట్రం పరువు తీసే కుట్ర జరుగుతున్నట్లు ప్రభుత్వం కూడా భావించింది.

చంద్రబాబును అప్రతిష్టపాలు చేయాల్సిన అవసరం ప్రతిపక్షం వైసీపీకి తప్ప ఇంకెవరికీ లేదంటూ మంత్రులు పలువురు మండిపడుతున్నారు. అదే విధంగా మెయిల్స్ వెనుక వైసీపీ హస్తం ఉంది కాబట్టి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహ నేరం కేసు పెట్టాలని మంత్రులు డిమాండ్ చేస్తున్న సంగతీ తెలిసిందే.

అయితే, మెయిల్స్ కు, తమకు ఎటువంటి సంబంధం లేదని మొదటి నుండి ఆరోపణలను వైసీపీ కొట్టి పారేస్తోంది. వైసీపీకి కానీ లేదా తమ సానుభూతిపరులు ఎవరూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ రత్నాకర్ చెబుతున్నారు.

ఇదిలావుండగా, అమెరికాలోని టిడిపి ఎన్ఆర్ఐ విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇర్వింగ్ పోలీసులు కేసు నమోదు చేసారు. మెయిల్స్ వెనుక ఎవరి హస్తముందో తేల్చేందుకు దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. కాబట్టి త్వరలోనే డల్లాస్ మెయిల్స్ వెనుక ఎవరున్నారో బయటపడనున్నది.

click me!