
రాష్ట్రంలో రాజకీయ వైరుధ్యాలు ఎన్నిఉన్నాఢిల్లీ విషయంలో మాత్రం అధికార, ప్రతిపక్ష నేతలది ఒకే బాటగా ఉంది. ఎందుకంటే, ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వ ప్రాపకం చాలా అవసరం. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడి ముందు ఒదిగి ఉంటున్నారు. ఇద్దరూ ప్రధానికి అంతలా ఒదిగి ఉండటానికి కారణాలేమిటి? అంటే తమపై ఉన్న కేసుల్లో నుండి బయటపడేందుకే చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి అంతలా ఒదిగిఉంటున్నారన్నది వాస్తవం.
నిజానికి రాష్ట్రస్ధాయిలో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం బలం లేదన్న సంగతి అందరకీ తెలిసిందే. ఇద్దరికీ కూడా భాజపాపై ఆధారాపడి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అయినా కాలమహిమ కాబట్టి ఇద్దరు బలమైన ప్రాంతీయ పార్టీల నేతలతో భాజపా ఒకరేంజిలో ఆడుకుంటోంది. ప్రధానమంత్రి కూడా వీరిద్దరికన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన వ్యక్తి కావటం కూడా అందుకు కారణం కావచ్చు.
తనపై ఉన్న కేసుల కారణంగా కేంద్రంతో సఖ్యత పాటించక జగన్ కు వేరే దారిలేదు. సరే, సిబిఐ కేసులన్నాక విచారణ, అరెస్టులు ఉంటాయి కదా? జగన్ విషయంలోనూ అదే జరుగుతోంది. కేసుల్లో నుండి పలువురికి విముక్తి లభిస్తున్నా జగన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేసులు కొట్టేసేంత వరకూ జగన్ కేంద్రంతో సఖ్యతనే కోరుకుంటారు.
ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలపై జగన్ ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిజానికి పై అంశాల్లో చంద్రబాబు పాత్ర చాలా తక్కువన్న విషయం జగన్ కు తెలీదా? అయినా చంద్రబాబును విమర్శిస్తున్నారే గానీ కేంద్రాన్ని మాత్రం ఏమనటం లేదు. కేంద్రం ఇస్తానంటే చంద్రబాబేమన్నా వద్దన్నారా? లేదే. రాష్ట్రప్రయోజనాలను కాపాడటం మోడికే ఇష్టం లేదు కాబట్టే చంద్రబాబు కూడా వాటిని సాధిచలేక పోతున్నారన్నది వాస్తవం. మరి జగన్ మోడిని ఎందుకు నిలదీయటం లేదు?
ఇక, చంద్రబాబు విషయాన్ని చూస్తే పోయిన ఎన్నికల్లో కాళ్ళూ గడ్డాలు పట్టుకుని భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. కేవలం అధికారం కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి అధికారం కోసం భాజపా చుట్టూ తిరిగిన తర్వాత ప్రధానమంత్రి చంద్రబాబుకు ఎందుకు విలువిస్తారు? దానికితోడు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే నారావారు ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కున్నారు. ఆ కేసు మోడికి పెద్ద వరంగా మారింది. దాని నుండి బయటపడేందుకే కేంద్రానికి చంద్రబాబు సరెండర్ అయిపోయారు. కాబట్టి కేసుల నుండి బయటపడేంత వరకూ ఇద్దరూ ప్రధానమంత్రి చెప్పినట్టల్లా అడక తప్పదు.