
ఐవైఆర్ కృష్ణారావు గోలేంటే అర్ధం కావటం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్. చంద్రబాబునాయుడు ఏరొకోరి మరీ ఐవైఆర్ ను కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించారు. అటువంటిది ఫేస్ బుక్ లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టింగులను షేర్ చేసారట. సోమవారం నుండి టిడిపి అనుకూల మీడియాలో ఒకటే గోల.
అసలు ఆ పోస్టింగులను ఐవైఆర్ ఎందుకు షేర్ చేసారో తెలీదు. ఆయన ఫేస్ బుక్ పేజి నుండే ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగులు షేర్ చేసినట్లుంది. దాంతో ఛైర్మన్ పై పెద్ద దుమారమే రేగుతోంది.
కృష్ణారావును వెంటనే పదవి నుండి తొలగించాలంటూ టిడిపి వర్గాలు డిమాండ్లు చేస్తున్నాయి. టిడిపి అనుకూల నెటిజన్లు కూడా ఛైర్మన్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారికి మద్దతు ఇవ్వటమేంటంటూ నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. కొందరేమో కృష్ణారావు ఫెస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యుండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దుమారమంతటికీ కారణమైన కృష్ణారావు మాత్రం పోస్టింగులపై సరైన సమయంలో స్పందిస్తానంటున్నారు.