టిడిపిలో కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం

Published : Jun 20, 2017, 07:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టిడిపిలో కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం

సారాంశం

ఆశించింది దక్కనపుడు నేతలు అలగటం, తిరుగుబాట్ల లాంటివి కాంగ్రెస్ పార్టీలోనే చూసి తరించేవారు. అటువంటిది ఇపుడు అదే దారిలో తెలుగుదేశంపార్టీ నేతలు కూడా ప్రయాణిస్తున్నారు. తాజాగా చంద్రబాబునాయుడు వివిధ జిల్లాల అధ్యక్షుల ప్రకటన తర్వాత టిడిపిలో బయటపడుతున్న గొడవలే అందుకు నిదర్శనం.

సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టిడిపిలో కూడా కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం ఎక్కువైపోతోంది. ఆశించింది దక్కనపుడు నేతలు అలగటం, తిరుగుబాట్ల లాంటివి కాంగ్రెస్ పార్టీలోనే చూసి తరించేవారు. అటువంటిది ఇపుడు అదే దారిలో తెలుగుదేశంపార్టీ నేతలు కూడా ప్రయాణిస్తున్నారు. తాజాగా చంద్రబాబునాయుడు వివిధ జిల్లాల అధ్యక్షుల ప్రకటన తర్వాత టిడిపిలో బయటపడుతున్న గొడవలే అందుకు నిదర్శనం.

కొత్త అధ్యక్షులను ప్రకటించిన జిల్లాల్లో కనీసం ఐదు జిల్లాల్లోని సీనియర్ నేతలు చంద్రబాబు నిర్ణయంపై రెండురోజులుగా మండిపడుతున్నారు. విశాఖపట్నం రూరల్ అధ్యక్షునిగా పంచకర్ల రమేష్ బాబును చంద్రబాబు ప్రకటించారు. అయితే, జిల్లాకు సంబంధంలేని నేతను తమకు అధ్యక్షుడిని చేయటమేంటని విశాఖపట్నం రూరల్ జిల్లా నేతలు  మండిపడుతున్నారు.

ఇక, విజయనగరం జిల్లాలో మహంతి చిన్నంనాయుడును చంద్రబాబు నిర్ణయించారు. అయితే, మెజారిటీ నేతలు మహంతిని అధ్యక్షునిగా అంగీకరించమని తెగేసి చెబుతున్నారు. మండలస్ధాయి నేత మహంతిని జిల్లాకు అధ్యక్షుడిని చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాది ఇంకోకథ. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబును జిల్లా అధ్యక్షుడిని చేసారు. ఎందుకంటే, జడ్పీఛైర్మన్ గా రాంబాబును తప్పించి ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూ కొడుకును ఛైర్మన్ గా కూర్చోబెట్టాలన్నది తెరవెనుక ప్రయత్నం. అయితే, మెజారిటీ జడ్పీటీసీలు చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాంబాబు కూడా తనకు జిల్లా అధ్యక్ష పదవి కంటే ఛైర్మనే ముద్దంటున్నారు. ఒకవేళ అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలనుకుంటే ఛైర్మన్ గా కూడా తననే కొనసాగించాలంటూ చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా చిత్తూరుకు చెందిన మణిప్రసాద్(నాని)ను ప్రకటించారు. ఈయన నియామకాన్ని జిల్లాలోని సీనియర్లందరూ వ్యతిరేకిస్తున్నారు. జిల్లామొత్తానికి పరిచయం కూడా లేని వ్యక్తిని జిల్లాకు అధ్యక్షుడిని చేయటమేంటని నిలదీస్తున్నారు. అదేవిధంగా, కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ప్రభావం ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి మీద పడింది.

మొన్నటి వరకూ చక్రపాణిరెడ్డే జిల్లా అధ్యక్షుడు. అయితే, చంద్రబాబును కాదని మోహన్ రెడ్డి వైసీపీలో చేరిపోవటం చక్రపాణిరెడ్డికి మైనస్ అయ్యింది. మోహన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు చక్రపాణిరెడ్డి పరోక్ష సహకారం ఉందన్నది అధినేత అనుమానం. అందుకనే ముందుజాగ్రత్తగా చక్రపాణిరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవిని చంద్రబాబు ఊడబీకారు. విజయవాడ రూరల్ అధ్యక్ష పదవి విషయంలో నేతలమధ్య ఏకాభిప్రాయం లేని కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేసారు.

PREV
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu