
‘అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్లుం’ది ప్రభుత్వ వ్యవహారం. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుండి పచ్చని పంట పొలాలను లాక్కున్న ప్రభుత్వం ఇపుడు అవే భూములను ప్రైవేటు పరం చేస్తోంది. ఇందుకు భూకేటాయింపుల్లో సవరణలు తీసుకువచ్చింది. అంటే రైతుల భూములతో ప్రభుత్వం పక్కా ‘రియల్ వ్యాపారం’ చేస్తోందన్నమాట. ఆ పని రైతులే చేసుకోగలరు కదా? తనకు నచ్చిన వ్యక్తులకు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భూములను అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ సంస్ధలకైతే లీజుకు, ప్రైవేటు సంస్ధలకైతే ఏకంగా అమ్మేయటమే లక్ష్యంగా ప్రభుత్వం సవరణలు చేసింది.
ప్రజెక్టు సాకారమైన తర్వాత స్ధలకు సొంతం చేయటం కాదు. ఒప్పందం దశలోనే సదరు భూములను ప్రభుత్వం ప్రైవేటు సంస్ధలకు అమ్మేయటానికి సిద్ధపడుతోంది. ఎందుకంటే, ఆ భూములను బ్యాంకుల్లోనో లేదా ఫైనాన్స్ సంస్ధల్లోనో తనఖా పెట్టి రుణాలు తీసుకోవటానికి వీలుగానట. మరి, ఆ ప్రైవేటు సంస్ధ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు ప్రారంభించకపోతే పరిస్ధితి ఏమిటి? అంటే ప్రభుత్వం తాజాగా చేసిన సవరణలతో అటు ప్రభుత్వ ముఖ్యులతో పాటు ఇటు ప్రైవేటు సంస్ధలకే లాభం తప్ప యజమానులైన రైతులకు మాత్రం క్షవరమే. రైతుల భూములతో ప్రభుత్వం అచ్చంగా రియలఎస్టేట్ వ్యాపారమే చేస్తోందనేది స్పష్టమైంది.
ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే రాజధాని నిర్మాణం జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరఏళ్ళయినా ఇంత వరకూ రాజధాని డిజైన్లే సిద్ధం కాలేదు. పోనీ పాలనకు అవసరమైన పరిపాలనా భవనాలైనా నిర్మించారా అంటే అదీలేదు. ముక్కీ, మూలిగి ఓ తాత్కాలిక సచివాలయాన్ని మాత్రం నిర్మించగలిగారు. మళ్లీ ఎన్నికలకు మిగిలింది రెండున్నరేళ్లే. ఈ యేడాది అయిపోతే, అంతటా ఎన్నికల ఫీవర్ మొదలైపోతుంది. అప్పుడు పాలనా వ్యవహారాలు అంతగా సాగవు. అంటే ఇపుడు మాత్రం పాలన సవ్యంగా సాగుతోందా అనడగొద్దు. అంటే, సమీకరించిన భూముల్లో రాజధాని నిర్మాణం జరగక, ప్రైవేటు సంస్ధలకు భూములు ఇచ్చేసి, అటు వ్యవసాయం దెబ్బతిని... చివరకు అంతా గందరగోళమే.