
కొత్తగా టిడిపికి కాకినాడ తలనొప్పి తయారైంది. అసలే నంద్యాల ఉపఎన్నికతో అసస్తలు పడుతుంటే తాజాగా కాకినాడ మున్సిపల్ ఎన్నిక కూడా తోడైంది. గురువారమే ముగిసిన నామినేషన్ల ప్రక్రియలో టిడిపి-భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా నామినేషన్లు వేయటం గమనార్హం. ఎన్నిక జరుగుతున్న48 డివిజన్లలో భాజపాకు 10 డివిజన్లు కేటాయిస్తామని టిడిపి ప్రతిపాదించింది. అయితే, తమకు కనీసం 26 డివిజన్లు కేటాయించాల్సిందేనంటూ భాజపా నేతలు పట్టుపట్టారు.
పోటీ చేసే డివిజన్లపై ఇరువైపులా సయోధ్య కుదరలేదు. దాంతో నామినేషన్లకు చివరి రోజు కావటంతో రెండు పార్టీల నుండి నేతలు పోటా పోటీగా నామినేషన్లు వేసేసారు. అందులో భాజపా 26 డివిజన్లకూ నామినేషన్లు వేయటంతో టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. కాకినాడలో టిడిపికన్నా తమకే బలముంది కాబట్టి, పైగా మోడి హవా బాగా నడుస్తోంది కాబట్టే తాము అన్ని డివిజన్లు అడుగుతున్నట్లు భాజపా నేతలంటున్నారు. సరే, నిజంగానే భాజపాకు అంత బలముందా? మోడి హవా అంతలా వుందా అన్నది భవిష్యత్తే తేలుస్తుందనుకోండి అది వేరే సంగతి.
టిడిపితో పొత్తు లేకపోయినా పర్వాలేదు, ఒంటరి పోటీకీ సిద్దమే అంటూ భాజపా నేతలు రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఎటూ ఒంటరిగానే పోటీ చేస్తున్నామంటూ భాజపా నేతలు ఎవరికి వారు మానసికంగా సిద్ధమైపోతున్నారు. అందులో భాగమే ప్రస్తుత పోటీ నామినేషన్లు. మరి, భాజపా అడుగుతున్నట్లు టిడిపి 26 డివిజన్లు ఇవ్వకపోతే ఏం చేస్తారు అన్నది శుక్రవారం తేలిపోతుంది. ఇరు పార్టీల నేతలు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మొత్తం మీద భాజపాకు ఓ 17 డివిజన్లు కేటాయిస్తారని అనిపిస్తోంది. ఎందుకంటే, భాజపా తన బలాన్ని అతిగా అంచనా వేసుకుంటోంది అని అనుకున్నా పోటీ నుండి తప్పుకోకపోతే చివరకు నష్టపోయేది మాత్రం టిడిపినే. చూడాలి సాయంత్రానికి ఏం తేలుతుందో?