
తెలుగుదేశం పార్టీ సీనియర్లలో అత్యధికులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు వచ్చేది అనుమానమే. అంటే దాదాపు వారిలో క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నట్లే. వారిలో చాలామంది 1982లో ఎన్టీఆర్ టిడిపి పెట్టినపుడు చేరినవారే. కొందరు మధ్యలో టిడిపిని వదిలిపెట్టి బయటకు వెళ్లినప్పటికీ మళ్ళీ పార్టీలో చేరినవారు కూడా ఉన్నారు. చంద్రబాబునాయడు వైఖరి చూస్తుంటే సీనియర్లలో చాలామందిని రిటైర్ చేయించి తనయుడు లోకేష్ ఆధిపత్యానికి అడ్డులేకుండా చూసుకుంటారని అర్ధమవుతోంది. అటువంటి వాళ్ళ విషయంలో బహుశా వాళ్ళ వారసులకు అవకాశాలు కల్పించే ఛాన్సలున్నాయ్.
సీనియర్లపై లోకేష్ ఆధిపత్యం చెలాయించే అవకాశాలు దాదాపు లేవు. ఎంతైనా వయస్సు అంతరం ఉంటుంది కదా? లోకేష్ ఏమో 30ల్లో ఉంటే చాలామంది సీనియర్లేమో 70ల్లో ఉన్నారు. అదే వారసులపైనైతే లోకేష్ పూర్తి ఆధిపత్యం చెలాయించవచ్చు. తప్పని సరిగా రిటైర్ అయ్యేవారి పేర్లు కొన్ని పార్టీలో చక్కర్లు కొడుతున్నాయి.
ఉత్తరాంధ్ర నుండి గౌతు శ్యాంసుందర శివాజి, ప్రతిభాభారతి, కళావెంకట్రావ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, సతివాడ నారాయణ స్వామి, అశోక్ గజపతి రాజుతో పాటు మరో 10 మంది దాకా ఉన్నారు. ఇక, కోస్తా జిల్లాల్లో చూస్తే యనమల రామకృష్ణుడు, కరణం బలరాం, బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటివారు 10 మందున్నారు. అలాగే, రాయలసీమలో కెఇ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమనాయడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జెసి సోదరరులు, హనుమంతరాయ చౌదరి, శమంతకమణి లాంటి వాళ్ళకు టిక్కెట్లు దక్కేది అనుమానమే. అయితే, వీరిలో కొందరు ఇప్పటికే తమ వారసులను సిద్ధం చేసుకున్నారు.
సీనియర్లైన చింతకాయల, గాలి, కెఇ, జెసి, బొజ్జల, బండారు, గౌతు, యనమల లాంటి వాళ్ళ వారసులు ఇప్పటికే రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో వారి వారసులకే టిక్కట్లు వచ్చేందుకు అవకాశాలున్నాయి. అందుకనే తండ్రుల తరపున వారసులే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటి నుండే అన్నీ పనులూ చక్కబెడుతుండటం గమనార్హం.