జల్లికట్టు ఉద్యమంలో అసాంఘిక శక్తులా ?

First Published Jan 23, 2017, 4:50 AM IST
Highlights

ఉద్యమాకారుల రూపంలో అసాంఘీక శక్తులు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం.

తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్తంగా మారుతోంది. మెరీనాబీచ్ లో జల్లికట్టు నిర్వహణ కోసం ఉద్యమం చేస్తున్న ప్రజానీకంపై పోలీసులు సోమవారం ఉదయం టియర్ గ్యాస్ ప్రయోగించటంతో పాటు లాఠీఛార్జ్ కూడా చేసారు. దాంతో వందలాదిమంది విద్యార్ధులకు తీవ్రగాయాలయ్యాయి. మధురైలో కూడా ఉద్యమాకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో ప్రజానీకం ప్రత్యేకించి యువత రెచ్చిపోతోంది.

 

జల్లికట్టుకు ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత కూడా ఆందోళనకారులు రెచ్చిపోతుండటం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ అవటంతో ముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం ప్రజల మద్దుతు పొందినట్లైంది. దాన్ని పార్టీలోని ఓ వర్గం సహించలేకపోయింది.  అప్పటికే పన్నీర్ ను పదవి నుండి దింపటానికి తమిళనాడులో అంతఃపుర రాజకీయలు మొదలైనట్లు జరుగుతున్న ప్రచారానికి ఊపొచ్చింది.

 

ప్రజల్లో పన్నీర్ కు మార్కులు కొట్టేయటాన్ని సహించలేని పార్టీలోని ఓ వర్గం ఉద్యమానికి ఆజ్యం పోస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికితోడు జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యమాకారుల రూపంలో అసాంఘీక శక్తులు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం. సందట్లో సడేమియాలగా ప్రతిపక్ష డిఎంకె ఆందోళనలకు ఆజ్యం పోస్తోంది.

 

ఆర్డినెన్స్ జారీని ఉద్యమకారులు అంగీకరించటం లేదు. జల్లికట్టుకు శాస్వత పరిష్కారం కావాలంటూ ప్రజానీకం పట్టుపట్టింది. అందుకోసం ఏకంగా చట్టం చేయాల్సిందేనంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆర్డినెన్స్ జారీ కాగానే సమస్య పరిష్కారం అయిపోయిందనుకున్నారు. కానీ అసలు సమస్య ఇపుడే ఊపందుకున్నట్లు కనబడుతోంది. చివరకు జల్లికట్టు వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందోనని సర్వత్రా ఆందోళన మొదలైంది.

 

 

click me!