చంద్రబాబుకు బిజెపి షాక్..

Published : Feb 12, 2018, 10:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
చంద్రబాబుకు బిజెపి షాక్..

సారాంశం

చంద్రబాబు మనిషిగా ఉన్న కామినేని విషయంలో బిజెపి అధిష్టానం మొదటినుండి గుర్రుగానే ఉంది.

మంత్రి కామినేని శ్రీనివాసరావును దూరంగా ఉంచటం ద్వారా చంద్రబాబుకు  బిజెపి అధిష్ఠానం షాక్ ఇచ్చిందా? పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు మనిషిగా ఉన్న కామినేని విషయంలో బిజెపి అధిష్టానం మొదటినుండి గుర్రుగానే ఉంది. కాబట్టి త్వరలో కామినేని బిజెపిలో నుండి టిడిపిలోకి వెళ్ళిపోవటం ఖాయంగా తెలుస్తోంది. అదే సమాచారం పార్టీ జాతీయ నాయకత్వం వద్ద కూడా ఉంది. అందుకనే ఏ విషయంలో కూడా కామినేనిని జాతీయ నాయకత్వం విశ్వాసంలోకి తీసుకోవటం లేద. తాజాగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఓ ఘటనే అందుకు ఉదాహరణగా నిలిచింది.

ఇంతకీ విషయం ఏమిటంటే? చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో బిజెపి తరపున పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు మంత్రులుగా ఉన్నారు. అయితే, కామినేని పేరుకే బిజెపి కానీ దాదాపు చంద్రబాబు మనిషిగానే వ్యవహరిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపి నుండి బిజెపిలోకి వచ్చి కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. వెంకయ్యనాయుడు చలవతో మంత్రి కూడా అయిపోయారు.

ఎప్పుడైతే వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోయారో అప్పటి నుండి కామినేనికి ఇబ్బందులు మొదలయ్యాయి. దానికితోడు ఈమధ్యలో బిజెపి-టిడిపి సంబంధాలు క్షీణించిన సంగతి అందరూ చూస్తున్నదే. చంద్రబాబుపై బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రతీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాయించేస్తున్నారు. దాంతో వీర్రాజు మీద చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు, బిజెపిలోని చంద్రబాబు మద్దతుదారులందరూ మండిపోతున్నారు.

దాంతో వీర్రాజుకు చెక్ పెట్టేందుకు అందరూ కలిసి మంత్రిని రంగంలోకి దింపారట. వీర్రాజుపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేద్దామని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అపాయిట్మెంట్ కూడా తీసుకున్నారు. ఢిల్లీకి చేరుకుని వెంటనే షా కార్యాలయానికి చేరుకున్నారు. అమిత్ షా దగ్గర నుండి కబురు రాగానే కామినేని వెంటనే ఆయన ఛాంబర్లోకి వెళ్ళారు.

కామినేనిని చూడగానే ‘కామినేని గారు టిడిపిలోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు’ అన్న అర్దం వచ్చేట్లుగా షా పలకరించారట. షా దెబ్బకు ఖంగుతిన్న కామినేని అక్కడే ఉంటే ఇబ్బందులు తప్పవని గ్రహించి అమిత్ షాకు ఓ నమస్కారం పెట్టేసి వెంటనే అక్కడి నుండి బయటపడ్డారట. తాను వెళ్ళింది ఒకందుకైతే ఎదురైన అనుభవంతో బుర్ర గిర్రున తిరిగి వెంటనే విజయవాడ చేరుకున్నారట. ఇపుడీ విషయం బిజెపి నేతల మధ్య బాగా నలుగుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లోగా కామినేని మళ్ళీ టిడిపిలోకి వెళ్ళిపోవటం ఖాయమని చెప్పుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Ap Deputy CM Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Visit Visakhapatnam Zoo | IndiraGandhi Zoological Park| Asianet News Telugu