
గుంటూరు జిల్లాలో శబరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. గుర్తుతెలియని దుండగులు నల్లపాడు-గుంటూరు సెక్షన్‌ల మధ్య రైలు పట్టాలపై అడ్డంగా ఇనుప రాడ్డును కట్టి ఉంచారు. అనుమానం రాకుండా అట్టముక్కలు కూడా పెట్టారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో సికింద్రాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఆ మార్గంలో వెళ్లాల్సి ఉంది. అయితే రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును గమనించిన శబరి ఎక్స్‌ప్రెస్ లోకోపైలెట్ మంజునాథ్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఇంజనీరింగ్ సిబ్బంది, సహాయ లోకోపైలెట్లు వెళ్లి రాడ్డును తొలగించిన అనంతరం లోకోపైలెట్ రైలును గుంటూరు స్టేషన్‌కు చేర్చారు.
అయితే రైల్వే ట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్డును ఉంచడం ఆకతాయిలు చేసిన పనికాదని.. దుండగులు పథకం ప్రకారమే ఇలా చేసి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇనుప రాడ్డును పట్టాలకు గుడ్డతో కట్టడమే కాకుండా.. అది ఏర్పడకుండా అట్టముక్కలు పెట్టడం వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై ఈ ఘటనపై రైల్వే పోలీసులు సెక్షన్ 154, 174సీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే పట్టాలపై ఇనుపరాడ్డును గుర్తించి రైలును వెంటనే నిలిపివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రైలు రాడ్డుపై నుంచి వెళ్లిన సమయంలో.. రాడ్డు విరిగి లోకో అడుగు భాగాన తగిలి మండలు వ్యాపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.