విద్యార్ధుల డ్రాపవుట్స్ లేకుండా చూడాలి: సీడీజీ సమీక్షలో అధికారులతో జగన్

By narsimha lode  |  First Published Oct 31, 2022, 7:13 PM IST


సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం  వైఎస్  జగన్  సోమవారం నాడు   సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ లక్ష్యాల సాధనకు గాను గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని సీఎం కోరారు.


అమరావతి:  ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి నెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని  సీఎం  ఆదేశించారు.

 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం  వైఎస్ జగన్‌ సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏరకంగా పనిచేస్తున్నారో పరిశీలించాలన్నారు.
దీంతో సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుందన్నారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుందని  ఆయన చెప్పారు.గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో  వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అన్న విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలని  సీఎం  కోరారు.

Latest Videos

undefined

 ప్రగతి అనేది కేవలం అందమైన అంకెల రూపంలో చూపడం కాదన్నారు. అవి వాస్తవ రూపంలో ఉండాలని సీఎం సూచించారు.ప్రతి అంశంలో కూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సీఎం కోరారు.లేకపోతే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని  సీఎం కోరారు.ప్రభుత్వ లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాలను చోదక శక్తిలా వాడుకోవాలని సీఎం సూచించారు. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలన్నారు.సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ కూడా ముఖ్యమేనని సీఎం జగన్  చెప్పారు.దీంతో సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలన్నారు. వీలైనంత త్వరగా ఈ అధికారులను నియమించాలని  కోరారు.వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడంలేదన్నారు. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల వివరాలు నమోదు కావాలని సీఎం కోరారు.ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి  సాంకేతికతను వాడుకోవాలని సీఎం  కోరారు.పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూడదన్నారు.
ఎక్కడైనా డ్రాప్‌అవుట్‌ జరిగితే  అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే  ఇంటికివెళ్లి ఆరాతీయాలని అధికారులను కోరారు.

ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రత అంశాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు.గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, రక్షిత తాగునీరు అంశాలపైకూడా దృష్టిపెట్టాలని  అధికారులను కోరారు.

విద్యారంగం సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు వలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని సీఎం  అభిప్రాయపడ్డారు.స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయన్నారు.

ఈ సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

click me!