జగన్ సర్కార్ కు... తెలుగంటే కేవలం బూతుల కోసమేనా...: లోకేష్ ఆగ్రహం

By Arun Kumar PFirst Published Feb 21, 2021, 12:56 PM IST
Highlights

పిల్లలకు విద్యాభ్యాసం నేర్పించేందుకు కూడా తెలుగు పనికిరాదన్నట్లుగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 

అమరావతి: తెలుగు బాషంటే వైసిపి ప్రభుత్వానికి చులకనబావం వుందని... అందువల్లే పిల్లలకు విద్యాభ్యాసం నేర్పించేందుకు కూడా తెలుగు పనికిరాదన్నట్లుగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, లోకేష్ సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలిపారు. 

''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. తెలుగు మన మాతృభాష కావడం మనందరికీ గర్వకారణం. కానీ ఈ ప్రభుత్వానికి తెలుగంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి తప్ప, పిల్లలకు చదువు నేర్పించే మాధ్యమంగా పనికి రాదని అభిప్రాయం ఉంది. అది తప్పు. మాతృభాష అన్నది మన మూలాలకు సంకేతం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా మన పిల్లలకు తప్పనిసరిగా తెలుగు భాష నేర్పించడం తెలుగువారందరి బాధ్యత'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.  

''ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు! ప్రతి ఒక్కరికీ పుడుతూనే దక్కే వారసత్వ సంపద మాతృభాష. శ్రీ కృష్ణ దేవరాయల వంటి స్వదేశీయుల నుండి సి.పి.బ్రౌన్ వంటి విదేశీయులను కూడా ఆకర్షించిన తెలుగు భాష, వైసీపీ పాలకుల దృష్టిలో చులకనవడం దురదృష్టకరం'' అన్నారు చంద్రబాబు. 

''ఇతర భాషలను నేర్చుకోడానికి పునాది మాతృభాష. ఆ పునాదినే లేకుండా చేసి గాలిలో మేడలు కడతామనేవారిని ఏమనాలి? ఆంగ్ల మాధ్యమానికి తెలుగుదేశం వ్యతిరేకం కాదు. ఏ మాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉండాలన్నదే తెలుగుదేశం అభిమతం'' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
 

click me!