ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత అదే జట్టుతో టీ20 సీరిస్ ఆడుతోంది టీమిండియా. విశాఖపట్నం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు.
విశాఖపట్నం : భారత్-ఆస్ట్రేలియా మధ్య నేటినుండి టీ20 సీరిస్ ప్రారంభంకానుంది. ఐదు టీ20ల ఈ సీరిస్ లో మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న టీమిండియా యువ జట్టు ఇవాళ సాయంత్రం మొదటి టీ20 ఆడనున్నారు. దీంతో ఈ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
గురువారం ఉదయమే తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తదితర టీమిండియా ఆటగాళ్ళతో కూడిన బృందం సింహాచలం ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు, అధికారులు. ఆటగాళ్లకు స్వామివారి దర్శనంచేయించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం క్రికెటర్లకు తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు ఆలయ పండితులు.
ఐదు టీ20ల సీరిస్ ను విజయంతో ఆరంభించాలని సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలోని టీమిండియా భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే యువ క్రికెటర్లంతా ముమ్మర సాధన చేసారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియా ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇది... అది కూడా ఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియాతోనే ఆడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖలో జరుగుతున్న మొదటి టీ20లో గెలిచి యువ ఆటగాళ్ళు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుతున్నారు.
వీడియో
ఇప్పటికే టీ20 మ్యాచ్ కోసం సర్వం సిద్దం చేసినట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విశాఖ ప్రజలకు టీ20 మజాను అందించేందుకు టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు సిద్దంగా వున్నాయి. అయితే ప్రపంచ కప్ ఆడిన జట్టులో కేవలం సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసీద్ద్ కృష్ణ మాత్రమే ప్రస్తుత టీ20 సీరిస్ ఆడుతున్నారు.
Read More India vs Australia: టీ20ల్లో మనోళ్లదే పైచేయి.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ బాధను చెరిపివేసేలా ఈ టీ20 సీరిస్ విజయం వుండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్రపంచ కప్ లో అందివచ్చిన అవకాశాలను యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరీముఖ్యంగా ఫైనల్లో టీమిండియా తక్కువ పరుగులకే పరిమితం కావడానికి సూర్యకుమార్ జిడ్డు బ్యాటింగ్ కూడా ఓ కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీ20 సీరీస్ లో అయినా ఈ యువ కెప్టెన్ తన స్టైల్లో ఆడి ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొంటాడేమో చూడాలి.