
రాబోయే రెండేళ్ళల్లో రాష్ట్రంలోని ఐటి పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు వస్తాయని ఐటిశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. విజయవాడలోని ఓ సంస్ధకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. చదువుకున్న ప్రతీ యువతీ, యువకులకు ఇదే గడ్డపై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మూడేళ్ళలో ఎంతమందికి ఉద్యోగవకాశాలు ఇచ్చారు? రాబోయే రెండేళ్ళల్లో లక్ష ఉద్యోగాలు ఇవ్వటానికి? సరే చెప్పుకోవటానికి ఏముంది లేండి ఎంతైనా చెప్పుకోవచ్చు.
లక్షలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పటం వరకూ బాగానే ఉంది. కానీ అదే సందర్భంలో రెండేళ్ళ క్రితమే తాను సెల్ ఫోన్ మాన్యుఫాక్చరర్స్ తో సమావేశమయ్యానని చెప్పటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండేళ్ళ క్రితం సెల్ ఫోన్ మాన్యుఫాక్ఛరర్లకు సిఎంతో ఓ సమావేశం జరిగిందట. అయితే, ఆ సమావేశానికి చంద్రబాబునాయుడు హాజరు కాలేకపోయారట. అందుకనే తాను హాజరయ్యానని స్వయంగా లోకేషే చెప్పారు. మాన్యుఫాక్చరర్లందరికీ భోజనాలు పెట్టించానని కూడా చెప్పుకున్నారు. అసలు రెండేళ్ళ క్రితం ప్రభుత్వంలో లోకేష్ స్ధాయి ఏమిటి? కేవలం చంద్రబాబునాయుడు కొడుకు. అంతే కదా? కేవలం చంద్రబాబు కొడుకన్న అర్హతతోనే సిఎం పాల్గొనాల్సిన సమావేశాల్లో సిఎంకు బదులుగా లోకేష్ పాల్గొనవచ్చా?
ముఖ్యమంత్రి పాల్గొనలేకపోయిన సమావేశాలకు సిఎం అనుమతితో ప్రభుత్వ ప్రధాన కార్యకర్శిగానీ, ఉప ముఖ్యమంత్రులో ఎవరో ఒకళ్ళు లేక ఐటి శాఖకు అప్పట్లో మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాధరెడ్డి కానీ హాజరవ్వాలి. అంతేకానీ లోకేష్ హాజరవ్వటం ఏమిటి? అంటే నారావారి పాలనలో రాజ్యాంగం, ప్రోటోకాల్ లాంటివి ఏమి ఉండవన్న మాట.