ప్రపంచంలో ఎక్కడాలేనంత పాజిటివ్ రేట్ నెల్లూరులోనే... ఎంతంటే..: సోమిరెడ్డి ఆందోళన (వీడియో)

By Arun Kumar PFirst Published Apr 21, 2021, 5:06 PM IST
Highlights

నెల్లూరులో కరోనా కల్లోల పరిస్థితులపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయగానే హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని స్పందించారంటూ ఆయనకు మాజీ మంత్రి సోమిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్న కరోనా కేసులపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న(మంగళవారం)ఒక్కరోజే 3325 పరీక్షలు చేస్తే 1347 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇలా 40శాతానికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రపంచంలోనే అరుదైన పరిస్థితి అంటూ సోమిరెడ్డి  ఆందోళనపడ్డారు. 

నెల్లూరులో కరోనా కల్లోల పరిస్థితులపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయగానే హెల్త్ మినిస్టర్ స్పందించారంటూ సోమిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అయితే మరొక్కసారి సీఎం జగన్ కి, హెల్త్ మినిస్టర్ ఆళ్ల నానికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ నెల్లూరు జిల్లాలో కరోనా తాజా పరిస్థితులపై సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వెంటనే నెల్లూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించారు. ఇలా ప్రమాదకర పరిస్థితుల నుంచి నెల్లూరు జిల్లాను కాపాడాలని సోమిరెడ్డి కోరారు. 

''రాష్ట్రంలోని 13 జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరులో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో బెడ్లు, ఆక్సిజన్లు, వెంటిలేటర్లు, రెమ్ డెసివర్ కొరత ఏర్పడకుండా అవసరమైన మేర సిద్ధం చేయండి. రెమ్ డెసివర్ ను కేవలం జీజీహెచ్ కే పరిమితం చేయకుండా కోవిడ్ చికిత్స అందిస్తున్న నోటిఫైడ్ ఆస్పత్రుల్లోనూ అందుబాటులో ఉంచాలి'' అని సూచించారు. 

వీడియో

''కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు కళ్యాణ మండపాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒక మోస్తరు లక్షణాలు ఉన్నవారిని ఆ మండపాల్లోనూ, తీవ్రంగా ఉన్నవారిని ఆస్పత్రుల్లోనూ ఉంచి చికిత్స అందించాలి. యుద్ధప్రాతిపదికన అవసరమైన సిబ్బంది నియామకాలు జరగాలి. ఆస్పత్రుల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లోని వెంటిలేటర్లను కూడా కోవిడ్ రోగుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. నెల్లూరు జీజీహెచ్ లో ఖాళీగా ఉన్న సుమారు 90 వెంటిలేటర్లను ప్రైవేటు ఆస్పత్రులకు పంపి రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలి'' అని సోమిరెడ్డి ప్రభుత్వాన్ని సూచించారు. 

''నెల్లూరులో వెంటిలేటర్ సౌకర్యం లేక అనేక మంది చెన్నైకి వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. ఓ వైపు వ్యాధి తీవ్రత, మరోవైపు మూడు, నాలుగు గంటల ప్రయాణం ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది. నెల్లూరు జిల్లాలోని పరిస్థితులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ప్రజలను కాపాడే విషయంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని చేతులెత్తి వేడుకుంటున్నాను'' అని మాజీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. 

click me!