
అమరావతి: ఇప్పటికే తెలుగు సంవత్సరాది ఉగాది రోజుల నూతన జిల్లాలను జగన్ సర్కార్ లాంఛనంగా ప్రారంభించింది. అంతేకాదు పాత 13 జిల్లాలతో పాటు నూతనంగా ఏర్పాటుచేసిన మరో 13 జిల్లాలకూ కలెక్టర్, ఎస్పీ లను నియమించారు. ఇలా 26 జిల్లాల్లో ఐఎఎస్, ఐపిఎస్ లను సర్దుబాటు చేయగా తాజాగా రాష్ట్రస్థాయి కీలక శాఖల్లోనూ ఐఎఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా బదిలీల్లో సీఆర్‌డీఏ కమిషనర్‌గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఆయనకే ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక రవాణాశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్, మున్సిపల్ శాఖ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. జీఎడి కార్యదర్శిగా అరుణ్ కుమార్ నియమితులయ్యారు.
ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా గంధం చంద్రుడు, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా చేవూరి హరికిరణ్, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌గా జె.నివాస్ బదిలీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె.ఆర్.బిహెచ్.ఎన్.చక్రవర్తిని నియమించింది ప్రభుత్వం.
రాష్ట్ర యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా జి. వాణీ మోహన్ ను బదిలీ చేసారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహార్‌లాల్, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా వీరపాండ్యన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది వైసిపి ప్రభుత్వం.