వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం.. ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు..

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 1:20 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు స్వీకరించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు ఎస్‌సీ/01/2023 నెంబర్‌ను కేటాయించింది. వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ చార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఐదుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

ఇక, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వివేకా హత్య కేసు విచారణ, హత్య వెనుక విస్తృత కుట్ర కోణంకు సంబంధించిన దర్యాప్తును గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌కు బదిలీ చేసింది. దీంతో ఇటీవల ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను  కడప నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

Also Read: వైఎస్ విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ.. సీబీఐ విచారణకు ముందు కీలక పరిణామం..!

ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం సీబీఐ అధికారులు ఎదుట అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

ఇక, సీబీఐ విచారణ హాజరు నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో విజయమ్మ నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లిన అవినాష్ రెడ్డి.. ఆమెతో దాదాపు 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం అవినాష్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, తాను ఈరోజు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. విజయమ్మతో భేటీ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అంశాలను చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు తీవ్ర సంచలనంగా  మారే అవకాశాలు కనిపిస్తుంది.

click me!