పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో భార్యను హత్య చేశాడు భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో పొడిచి చంపాడు నిందితుడు. ఇవాళ ఉదయం గుడికి వెళ్లి వస్తున్న భార్య సంధ్యారాణిని మాట్లాడుదామని ఆపాడు భర్త రాంబాబు.భార్యతో మాట్లాడుతున్నట్టుగా నటించి ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. కొంతకాలంగా భార్య, భర్తల మధ్య విబేధాలు నెలకొన్నాయి.
నాలుగు నెలల క్రితం చైన్ స్నాచింగ్ కేసులో రాంబాబు పోలీసులకు చిక్కాడు. దీంతో వీరి మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడ పెట్టారు. వీరిద్దరూ చట్ట ప్రకారంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కోర్టులో విడాకులకు ధరఖాస్తు కూడ చేసుకున్నారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. సంధ్యారాణి విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. విజయవాడలోనే ఆమె ఉంటుంది. రెండు రోజులు సెలవులు రావడంతో ఆమె తన పుట్టింటికి వచ్చింది.
undefined
ఇవాళ ఉదయం గుడికి సంధ్యారాణి ఒంటరిగా వచ్చిన విషయాన్ని గుర్తించిన రాంబాబు ఆమెపై దాడికి దిగాడు. సంధ్యారాణిని హత్య చేసిన తర్వాత రాంబాబు పారిపోయాడు.సంఘటన స్థలంలో సంధ్యారాణి మృతదేహన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంధ్యారాణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంధ్యారాణి, రాంబాబులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహనికి పెద్దలు కూడ అంగీకరించారు. అయితే పెళ్లైన తర్వాత రాంబాబు గురించి తెలుసుకున్న సంధ్యారాణి అతడిని నిలదీసింది. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలు ప్రారంభమైనట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాలుగు మాసాల క్రితం దొంగతనం కేసులో రాంబాబు పట్టుబడడంతో ఈ గొడవలు మరింత ఎక్కువయ్యాయని సంధ్యారాణి పేరేంట్స్ చెబుతున్నారు. తమ కూతురిని చంపిన రాంబాబును కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి పేరేంట్స్ డిమాండ్ చేస్తున్నారు.