ఏలూరు జిల్లా వీరమ్మకుంట సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ ఇవాళ జరుగుతుంది. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఏలూరు:జిల్లాలోని పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం నాడు సాగుతుంది. పోలింగ్ ను పురస్కరించుకుని టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.ఈ సర్పంచ్ ఉపఎన్నికను టీడీపీ, వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వీరమ్మకుంట సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ, వైసీపీలు పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిలు ఈ ఎన్నికను పురస్కరించుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రెండు రోజుల క్రితం వీరమ్మకుంటలో రెండు పార్టీలు ప్రచారం నిర్వహించే సమయంలో కూడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ఇవాళ పోలింగ్ జరిగే సమయంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఏపీ రాష్ట్రంలో ఖాళీగా సర్పంచ్, వార్డు పదవులకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు.రాష్ట్రంలోని 35 సర్పంచ్ 245 వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలను నిర్వహిస్తుంది ఎన్నికల సంఘం.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సర్పంచ్ ఉప ఎన్నిక సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను చెదరగొట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బొప్పడంలో కూడ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న చోట్ల జరిగిన ఘర్షణలపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘర్షణలకు గల కారణాలపై పోలీసుల నుండి సమాచారం సేకరిస్తుంది.