
నవంబర్ మాసంలో రాష్ట్రం ప్రత్యేహోదా పేరుతో హోరెత్తిపోనున్నది. నవంబర్ 5వ తేదీన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో విద్యార్ధులతో యువభేరి నిర్వహిస్తున్నారు. ’జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో జగన్ ప్రత్యేకహోదా కోసం యువభేరి నిర్వహిస్తున్నారు. అదే విధంగా జనసేన ఆధ్వర్యంలో నవంబర్ నెల 10వ తేదీన అనంతపురంలో ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనున్నది.
పై రెండు బహిరంగ సభల ప్రభావం ఏపి ప్రజలపై ప్రధానంగా యువతపై కొంత కాలం ఉంటుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. జగన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేకహోదా పేరుతో అనేక ఆందోళనలు, రాష్ట్రం బంద్ తో పాటు నిరసన దీక్షలు కూడా జరిపారు. అదే విధంగా పవన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేకహోదా డిమాండ్ తో మొదటి సభ తిరుపతిలోనూ రెండో సభ కాకినాడలోను జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక, ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రప్రభుత్వం అటకెక్కిచేసినట్లే. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రభుత్వం కూడా బాగా ఊతమిచ్చింది. ఒకసారి ప్రత్యేకహోదా సంజీవని కాదని, మరోసారి ప్రత్యేకహోదా లేకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని వ్యాఖ్యానాలు చేసిన ముఖ్యమంత్రి అంతిమంగా కేంద్రం ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్న ప్రత్యేక సాయంతో సరిపెట్టుకున్నారు. దాంతో చంద్రబాబు వైఖరితో తొలుత మండిపడ్డ ప్రజలందరూ చేసేదేమీ లేక మౌనంగా ఉన్నారు. అయితే, అటు జగన్ ఇటు పవన్ మాత్రం ప్రత్యేకహోదా అంశాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళుతుండటం గమనార్హం.