
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి వివాదం చివరకు కోర్టుకు ఎక్కింది. ఇన్ చార్జ్ కార్యదర్శి సత్యనారాయణ వ్యవహారం ఆదినుండి అనుమానాస్పదంగానే ఉంది. డిప్యుటి కార్యదర్శి మాత్రమే అయిన సత్యనారాయణ రాష్ట్ర విభజన అయినప్పటి నుండి ఇన్ చార్జ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సచివాలయంలో సత్యనారాయణ కన్నా ఎక్కువ విద్యార్హతలున్న డిప్యూటి కార్యదర్శులు పలువురు ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణల కారణంగానే అర్హులను కాదని ప్రభుత్వం సత్యనారాయణను ఇన్ చార్జ్ గా నియమించింది.
సత్యనారాయణ వ్యవహారంపై స్పీకర్ కోడెల శివప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఎన్నో ఫిర్యాదులు అందినా ఇంతవరకూ ఎవరూ చర్యలు తీసుకోలేదు. చివరకు గవర్నర్ కూడా సత్యనారాయణపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవటాన్ని ఉపేక్షిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే సత్యనారాయణ విద్యార్హతలతో పాటు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలోని వివిధ దశల్లో ఎన్నో మార్లు ఫిర్యాదు చేసారు. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ ను కలిసినా ఉపయోగం కనబడలేదు. దాంతో చేసేది లేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. చివరకు సోమవారం ఈ కేసును విచారించిన న్యాయస్ధానం పిటీషనర్ లేవనెత్తిన అన్నీ అంశాలపైనా కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చింది.
ఇదే విషయమై రామకృష్ణారెడ్డి ఏషియానెట్వర్క్ తో మాట్లాడుతూ, కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతలున్న సత్యనారాయణ అసెంబ్లీ కార్యదర్శిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న అన్నీ అవినీతి వ్యవహారాలను ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేసారు.